'బంగారం'లాంటి ఇల్లు అమ్మేస్తున్నారహో.. లోపలంతా బంగారమే మరి..

బయట చూడ్డానికి మామూలు ఇల్లులానే సాదా సీదాగా కనిపిస్తుంది. లోపలికి అడుగుపెట్టగానే కళ్లు మిరుమిట్లు గొలిపే పచ్చని పసిడి కాంతులు. కుర్చీలు, బెంచీలు, సోఫాలు అన్నీ ధగధగా మెరిసిపోతుంటాయి. షాండియర్ లైట్ల వెలుగులో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. 6,997 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవంతి రష్యాలోని ఈర్‌కుత్‌స్క్ నగరంలో ఉంది.
రెండెకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ భవంతిలో ఐదు బెడ్‌రూములు, డ్రెస్సింగ్ రూమ్‌లు, విశాలమైన హాలు, ప్రైవేట్ బాత్‌రూమ్‌లు, కారిడార్, పేద్ద వంటగది, డైనింగ్ హాల్ ఇలా అన్నింటిలో బంగారు తాపడంతో చేసిన వస్తువులు అమర్చి ఉంటాయి.
అడుగడుగున బంగారం తళతళలు మిరుమిట్లు గొలుపుతుంటాయి. ప్రఖ్యాత బైకాల్ సరస్సుకు సమీపంలో ఉండడం ఈ భవంతికి అదనపు ఆకర్షణ. ఈ భవంతికి విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్, వైన్ సెల్లార్, ఒక చేపల చెరువు, ఒక కృత్రిమ జలపాతం కూడా ఉన్నాయి. దీని ధర 2.1 మిలియన్ పౌండ్లు (రూ.21 కోట్లు).
అంతా బాగానే ఉంది కానీ.. చలికి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. అందుకే అమ్మేస్తున్నాను అంటున్నారు ప్రస్తుతం ఈ భవంతిలో నివసిస్తున్న యజమాని కానాగత్ రజమతోవ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com