20 Feb 2021 6:00 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / భారతీయులకు బైడెన్...

భారతీయులకు బైడెన్ సర్కార్ శుభవార్త

అమెరికాలో ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు బైడెన్ సర్కార్ శుభవార్త అందించింది.

భారతీయులకు బైడెన్ సర్కార్ శుభవార్త
X

అమెరికాలో ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు బైడెన్ సర్కార్ శుభవార్త అందించింది. భారతీయులతో పాటు విదేశీయులకు లబ్ధి చేకూరేలా ఓ అడుగు ముందుకు వేసింది. గ్రీన్‌కార్డు కోటా పెంపునకు వీలు కల్పించే ఇమ్మిగ్రేషన్‌ సవరణ బిల్లును చట్టసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ఉభయ సభలు ఆమోదిస్తే అక్రమ వలసదార్లకు అమెరికా పౌరసత్వం లభించనుంది.

దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారితో పాటు చట్టబద్ధంగా ఉంటున్న వారికి కూడా లబ్ధి చేకూరేలా ఈ బిల్లుని రూపొందించారు. దీనిని సెనేటర్‌ బాబ్‌ మెనెండెజ్, కాంగ్రెస్‌ సభ్యురాలు లిండా సాంచెజ్‌లు చట్టసభలో ప్రవేశపెట్టారు. వలసదారుల్లో భయం లేకుండా ఆర్థిక భద్రత కల్పించేలా ఈ బిల్లును తీసుకువచ్చినట్లు వారు తెలిపారు. అయితే కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభలో డెమొక్రాట్లకు పూర్తి మెజారిటీ ఉండగా.. ఎగువ సభ అయిన సెనేట్‌లో రెండు పార్టీలకు 50 చొప్పున సీట్లు ఉన్నాయి. సెనేట్‌లో ఈ బిల్లు పాస్‌ కావాలంటే మరో 10 మంది రిపబ్లికన్ల మద్దతు అవసరం.

గత ప్రభుత్వ తప్పిదాలను సవరిస్తూ వలసదారులకి న్యాయం జరిగేలా చూద్దామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అక్కడి ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. మన దేశం కోసం కష్టపడే వారి కలలను తీరుద్దామంటూ పేర్కొన్నారు. బైడెన్ సర్కార్ ప్రవేశపెట్టిన ఈ బిల్లులోని అంశాలను పరిశీలిస్తే.. గ్రీన్‌కార్డు మంజూరులో ఏడుశాతం దేశాల కోటాను ఎత్తేస్తూ మొదట దరఖాస్తు చేసుకునే వారికి మొదట గ్రీన్‌కార్డు జారీ చేసేలా నిబంధనల్లో మార్పు చేశారు. దీంతో పదేళ్లకు పైబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురు చూస్తున్న భారతీయులకు బిల్లు చట్టరూపం దాల్చగానే లబ్ధి చేకూరనుంది.

ఇక హెచ్‌1–బీ వీసాదారుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేసుకునే వీలు ఉంటుంది. విదేశాల్లో పుట్టి తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో ఉంటున్న పిల్లలందరికీ వారి వయసుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం కల్పించే అన్ని సదుపాయాలు లభిస్తాయి. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న 1.1 కోట్ల మంది అక్రమ వలసదారులకి మూడేళ్లలో పౌరసత్వం లభిస్తుంది. ఎల్‌జీబీటీక్యూ హక్కుల పరిరక్షణ, వారి కుటుంబసభ్యులు, అనాథలకి చట్టపరమైన రక్షణ కలుగుతుంది.అమెరికా యూనివర్సిటీల్లో చదివే విదేశీ విద్యార్థుల్లో స్టెమ్‌ కోర్సులు చేసేవారికి దేశంలోఉండడం మరింత సులభంగా మారనుంది. పరిశ్రమల్లో తక్కువ వేతనానికి పని చేసే కార్మికులకు కూడా గ్రీన్‌కార్డులు ఇచ్చే వెసులుబాటు ఉంటుంది.


Next Story