British Government Loan: 100 ఏళ్ల క్రితం ఇచ్చిన అప్పు.. 109 ఏళ్ల తర్వాత యూకేకు భారతీయుడి నోటీసులు!
బ్రిటీష్ సామ్రాజ్యంలో సూర్యుడు అస్తమించని కాలమది. అలాంటిది ఆ సామ్రాజ్యానికే ఒక భారతీయ వ్యాపారవేత్త నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యుద్ధ అవసరాల కోసం అప్పు తీసుకుని పత్రం రాసిచ్చింది. ఆపై తిరిగి చెల్లించకుండా వదిలేసింది. మధ్యప్రదేశ్‌లోని సీహోర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి సేథ్ జమ్మాలాల్ రుథియా నుంచి 1917లో బ్రిటీష్ ప్రభుత్వం అప్పట్లో రూ.35,000 అప్పుగా తీసుకుంది. ఆ కాలంలో ఇది సామాన్యమైన మొత్తం కాదు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్రిటీష్ ప్రభుత్వం భోపాల్ సంస్థానంలోని పరిపాలనా అవసరాల కోసం ఈ ‘వార్ లోన్’ తీసుకున్నట్లు తెలుస్తోంది.
వంద ఏళ్ల తర్వాత వెలుగులోకి..
బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పు ఇచ్చిన విషయం ఆ కుటుంబంలో అందరికీ తెలుసు. అయితే, దానికి సంబంధించిన పత్రాలే కనిపించలేదు. దీంతో 109 ఏళ్ల పాటు ఈ విషయం మరుగున పడిపోయింది. సేథ్ జమ్మాలాల్ మనవడు వివేక్ రుథియా తన తండ్రి మరణం తర్వాత పాత రికార్డులు, వీలునామాను పరిశీలిస్తుండగా ఈ రుణానికి సంబంధించిన పత్రాలు, సర్టిఫికెట్లు బయటపడ్డాయి. తన తాత ఇచ్చిన అప్పును బ్రిటీష్ ప్రభుత్వం ఇంతవరకు తిరిగి చెల్లించలేదని వివేక్ ఆరోపిస్తున్నారు. 1937లో జమ్మాలాల్ మరణించిన తర్వాత అవసరమైన సాక్ష్యాలు లేక ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా పోయిందని ఆయన వివరించారు.
1917 నాటి రూ.35,000 విలువను ఇప్పటి బంగారం ధరలతో పోల్చి చూస్తే అది కొన్ని వందల కోట్లకు చేరుతుందని రుథియా కుటుంబం వాదిస్తోంది. ‘‘సార్వభౌమ దేశాలు తాము గతంలో తీసుకున్న అప్పులను తీర్చాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి’’ అనే అంతర్జాతీయ చట్టాల ఆధారంగా బ్రిటీష్ ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపేందుకు ఈ కుటుంబం సిద్ధమవుతోంది.
ఒకప్పుడు సీహోర్, భోపాల్ సంస్థానాల్లో అత్యంత ధనిక కుటుంబంగా రుథియా కుటుంబానికి పేరుండేది. నేటికీ సీహోర్ పట్టణంలో దాదాపు 20 నుంచి 30 శాతం నివాసాలు ఈ కుటుంబానికి చెందిన భూముల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో చాలాబాగం న్యాయపరమైన చిక్కుల్లో ఉన్నాయి. వీరు వ్యవసాయం, రియల్ ఎస్టేట్ మరియు హాస్పిటాలిటీ రంగాల్లో వ్యాపారాలు చేస్తున్నారు. అయితే, ఈ పాత బాకీ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చట్టపరమైన చర్చకు దారితీసే అవకాశం ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


