Venezuela : వెనెజువెలా అధ్యక్ష భవనం సమీపంలో కాల్పులు..

వెనిజులా రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వేగంగా పరిణామాలు మారుతున్నాయి. అమెరికా దళాల మెరుపు దాడిలో అధ్యక్షుడు నికోలస్ మదురో పట్టుబడిన కొన్ని గంటలకే.. రాజధాని కరాకాస్‌లోని అధ్యక్ష భవనం మిరాఫ్లోర్స్ సమీపంలో సోమవారం రాత్రి భారీగా కాల్పుల శబ్దాలు వినిపించడం అంతర్జాతీయంగా కలకలం రేపింది. దేశంలో కొత్తగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటికే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
డ్రోన్ల కదలికలు.. భద్రతా దళాల కాల్పులు
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 8 గంటల సమయంలో అధ్యక్ష భవనంపై గుర్తు తెలియని డ్రోన్లు ఎగరడాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. దీనిని తీవ్రమైన ముప్పుగా భావించిన దళాలు వెంటనే అప్రమత్తమై వాటిని కూల్చివేసేందుకు కాల్పులు జరిపాయి. సుమారు నిమిషం పాటు ఈ కాల్పుల శబ్దాలు వినిపించాయని, ఆకాశంలో కొన్ని ఎరుపు రంగు కాంతులు కనిపించాయని అధ్యక్ష భవనానికి సమీపంలో నివసించే వారు వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలలో తూటాలు ఆకాశంలోకి దూసుకెళ్తున్న దృశ్యాలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.
అమెరికా హస్తం ఉందా?
ఈ కాల్పుల ఘటనపై అమెరికా శ్వేతసౌధం వెంటనే స్పందించింది. వెనిజులా అధ్యక్ష భవనం వద్ద జరుగుతున్న పరిణామాల్లో తమ ప్రమేయం ఏమీ లేదని అమెరికా స్పష్టం చేసింది. అయితే వెనిజులాలోని పరిస్థితులను తాము నిశితంగా గమనిస్తున్నామని అగ్రరాజ్య అధికారులు తెలిపారు. మరోవైపు సీఎన్ఎన్ కథనం ప్రకారం.. అధ్యక్ష భవనం వద్ద భద్రతను పర్యవేక్షించే పారామిలిటరీ దళాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం వల్లే ఈ కాల్పులు జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వెనిజులా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. రాజధానిలో మాత్రం ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్..
జనవరి 3వ తేదీన అమెరికా డెల్టా ఫోర్స్ కరాకాస్‌లోని మదురో నివాసంపై మెరుపు దాడి చేసి ఆయన్ను, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌ను అదుపులోకి తీసుకుంది. సుమారు 150 యుద్ధ విమానాలు, అత్యాధునిక హెలికాప్టర్లతో నిర్వహించిన ఈ ఆపరేషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. నార్కో-టెర్రరిజం, డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణల కింద మదురోను న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు. అక్కడ ఆయన తనపై ఉన్న ఆరోపణలను తోసిపుచ్చారు. మదురో అరెస్టుతో ఆయన అత్యంత సన్నిహితురాలు, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ .. వెనిజులా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. అమెరికా ఒత్తిడిని ఆమె ఎలా తట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

