H-1B Visa : రెండేండ్ల కాలానికే హెచ్-1బీ వీసా!

అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంలో కీలక సంస్కరణల దిశగా అడుగులు పడుతున్నాయి. ‘అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పునరుద్ధరణ’ అంశంపై విచారణ చేపట్టిన యూఎస్ హౌజ్ కమిటీకి సెంటర్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్‌కు చెందిన జెస్సికా ఎం వాఘన్ కీలక సంస్కరణలను ప్రతిపాదించారు. ప్రస్తుతం ఇతర దేశాలకు చెందిన నిపుణులు అమెరికా కంపెనీల్లో పని చేసేందుకు మూడేండ్ల కాలపరిమితితో ఇస్తున్న హెచ్-1బీ వీసాలను రెండేండ్లకే ఇవ్వాలని, అవసరమైతే నాలుగేండ్ల కాలానికి మాత్రమే పొడిగించే అవకాశం కల్పించాలని ఆమె సూచించారు.
గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారనే కారణంతో ఆటోమేటిక్‌గా హెచ్-1బీ వీసాను పొడిగించే విధానాన్ని తొలగించాలని ప్రతిపాదించారు. హెచ్-1బీ వీసాల సంఖ్యను సైతం 75 వేలకే పరిమితం చేయాలని సూచించారు. విద్యార్థి వీసాలపై(ఎఫ్-1, ఎం-1) అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల నుంచి చదువు పూర్తయిన తర్వాత తిరిగి సొంత దేశాలకు వెళ్తామనే సమ్మతిని తీసుకోవాలని ప్రతిపాదించారు. విదేశీయులకు వర్క్ వీసాలు ఇవ్వడం వల్ల అమెరికన్లు నిరుద్యోగులుగా మారుతున్నారని, స్టాఫింగ్ కంపెనీలు విదేశీయులకు వర్క్ వీసాలు స్పాన్సర్ చేయడానికి అనుమతించొద్దని సూచించారు.
గడువు ముగిసినా అమెరికాలోనే..
విద్యార్థి, ఎక్స్ఛ్‌ంజ్ వీసాలపై అమెరికాకు వస్తున్న చాలా మంది వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉంటున్నారని జెస్సికా ఎం వాఘన్ తెలిపారు. 2023లోనే వీసా గడువు ముగిసినా అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిలో భారతీయులే 7 వేల మంది ఉన్నారని, ఆ తర్వాత బ్రెజిల్, చైనా, కొలంబియా దేశస్థులు 2 వేల మంది కంటే ఎక్కువే ఉన్నారని నివేదించారు.
జన్మతః పౌరసత్వం రద్దుకు బిల్లు
అక్రమ, తాత్కాలిక వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు జన్మించే పిల్లలకు జన్మతః పౌరసత్వం ఇవ్వకుండా నియంత్రించే బిల్లు యూఎస్ సెనేట్ ముందుకు వచ్చింది. అధికార రిపబ్లికన్ పార్టీ సెనేటర్ల బృందం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా జన్మతః పౌరసత్వం ఇస్తున్న 33 దేశాల్లో అమెరికా ఒకటని ఈ బృందం పేర్కొన్నది. కాగా, ఇటీవలే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాన్ని జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనిపై కోర్టు స్టే విధించింది. మరోవైపు నేరచరిత్ర ఉన్న అక్రమ వలసదారులను విచారణకు ముందే నిర్బంధించేందుకు చేసిన లాకెన్ రిలే చట్టంపై ట్రంప్ బుధవారం సంతకం చేశారు. వీరిని నిర్బంధించేందుకు గ్వాంటనామో బేలో 30 వేల మంది పట్టేలా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com