H1B వీసా హోల్డర్స్‌కు బిగ్ రిలీఫ్.. తక్షణమే అమల్లోకి రానున్న కోర్టు తీర్పు

H1B వీసా హోల్డర్స్‌కి ఊరట కలిగించింది అమెరికా ఫెడరల్ న్యాయస్థానం. ట్రంప్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన H1B తదితర వీసాల తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేయాలంటూ అమెరికా ఫెడరల్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ వ్యవహారంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. .తన అధికార పరిధిని మీరి ప్రవర్తించారని కోర్టు అభిప్రాయపడింది. వీసాలపై నిషేధాన్ని రద్దు చేయాలంటూ ఉత్తర కాలిఫోర్నియా జిల్లా న్యాయమూర్తి జెఫ్రీ వైట్ ఇచ్చిన తీర్పు తక్షణమే అమల్లోకి రానుంది. ఈ కీలక తీర్పుతో భారత్‌కు చెందిన వేలాది ఐటీ నిపుణులకు మేలు జరగనుంది.
అమెరికా సంస్థల్లో ఉన్నత నైపుణ్యాలు అవసరమయ్యే ఉద్యోగాల్లో విదేశీయులను నియమించే H1B సహా పలు వీసాల జారీని... ఈ సంవత్సరం చివరి వరకు నిలిపివేస్తూ... జూన్‌లో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు. నిరుద్యోగులైన అమెరికన్ పౌరులకు మేలు కలిగించేందుకే తాము ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నామని ప్రెసిడెంట్ ట్రంప్ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.
వీసాల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ చర్యలవల్ల కీలక పదువుల్లో అత్యవసరమైన మానవ వనరులు లభ్యత కష్టమవుతుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫాక్చరర్స్ అభిప్రాయపడింది. దేశ ఆర్థిక పురోగతి కుంటుపడుతుందని పలువురు నిపుణులు కూడా హెచ్చరించారు. తాజాగా... అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పుతో... ఐటీ సహా పలువురు ప్రొఫెనల్స్‌కు ఊరట లభించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com