H1B Visa: హెచ్‌1బీ వీసా ఫీజు భారీగా పెంపు..

H1B Visa: హెచ్‌1బీ వీసా ఫీజు భారీగా పెంపు..
కొత్త ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి..

అమెరికా వెళ్లే భారతీయులపై మరింత భారం కానుంది. భారత్‌ నుంచి ఎక్కువ డిమాండ్‌ ఉండే హెచ్‌-1బీసహా కొన్ని కేటగిరీల వీసాల రుసుములను... అమెరికా భారీగా పెంచింది. ఈ పెంపు ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని అగ్రరాజ్యం ప్రకటించింది. వీసాల అప్లికేషన్‌ ఫీజులను పెంచడం 2016 తర్వాత ఇదే మొదటిసారి అని బైడెన్‌ సర్కారు వెల్లడించింది. తాజా నిర్ణయంతో హెచ్‌-1బీ వీసా దరఖాస్తు ధర 460డాలర్ల నుంచి 780డాలర్లకు పెంచింది. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ధరను కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు. అయితే, ఇది వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఎల్‌-1 వీసా దరఖాస్తు రుసుమును 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచారు. ఈబీ-5 వీసాల ఫీజులను 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచినట్లు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ తమ ఫెడరల్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

అమెరికా కంపెనీలు విదేశీ వృత్తి నిపుణులను నియమించుకునేందుకు హెచ్‌-1బీ వీసా అవకాశం కల్పిస్తుంది. ఈ వీసాలను వినియోగిస్తున్నవారిలో భారతీయులే అధికంగా ఉంటారు. ఈబీ-5 ప్రోగ్రామ్‌ను 1990లో ప్రారంభించారు. కనీసం 10మంది అమెరికా కార్మికులకు ఉద్యోగాలు కల్పించటంతోపాటు కనిష్ఠంగా 5 లక్షల డాలర్ల పెట్టుబడితో వ్యాపారాలు ప్రారంభించేవారికి ఈబీ-5 వీసాలను జారీ చేస్తారు. ఎల్‌-1 వీసా...కంపెనీలో అంతర్గతంగా బదిలీ అయ్యే ఉద్యోగులకు జారీ చేస్తారు. బహుళ జాతి కంపెనీలు విదేశాల్లోని తమ బ్రాంచీల నుంచి ఉద్యోగులను కొంతకాలంపాటు అమెరికాకు తీసుకొచ్చి పనిచేయించేందుకు ఈ వీసా అవకాశం కల్పిస్తుంది.

అమెరికన్‌ కంపెనీలు సైద్ధాంతిక, సాంకేతిక నైపుణ్యం అవసరమైన వృత్తుల్లో నియమించుకునే విదేశీ ఉద్యోగులకు హెచ్‌-1బీ వీసాలు జారీచేస్తారు. అమెరికాలోని టెక్‌ కంపెనీలు భారత్‌, చైనా లాంటి దేశాలకు చెందిన వేలాది వృత్తి నిపుణులను నియమించుకునేందుకు ప్రధానంగా హెచ్‌-1బీ వీసాలపైనే ఆధారపడతాయి. ప్రస్తుతం 460 డాలర్లుగా ఉన్న హెచ్‌-1బీ వీసా అప్లికేషన్‌ ఫీజును ఏప్రిల్‌ 1 నుంచి 780 డాలర్లకు పెంచుతున్నట్టు అమెరికా వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story