Saudi Arabia: సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..

సౌదీ అరేబియా అనగానే మక్కా, మదీనా, ఎడారి చిత్రాలే కళ్ల ముందు కదలాడుతాయి. కానీ, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. మక్కా, మదీనా, జెడ్డా, గవర్నరేట్‌లోని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వర్షాల కారణంగా వరదలు పోటెత్తడంతో భారీగా నష్టం వాటిల్లింది. బుధవారం సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది. ప్రస్తుతం, వరదలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌదీ అరేబియాలోని మక్కా, మదీనా ముస్లింలకు పవిత్రమైన ప్రార్థనా స్థలాలు. ప్రతి సంవత్సరం హజ్, ఉమ్రా యాత్ర కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు ఆయా నగరాలకు చేరుకుంటారు.
ప్రస్తుతం భారీ వర్షాలు సౌదీ అరేబియా వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. భారీ వర్షాల కారణంగా సౌదీలోని పలు నగరాలు నీట మునిగాయి. మున్ముందు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. జాతీయ వాతావరణ కేంద్రం (NMC) ఈ వారంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, తుఫానులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భారీ వర్షం కురిసేందుకు అవకాశం ఉందంటూ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో ప్రజలు ఇంట్లోనే ఉండాలని.. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని పరిపాలన హెచ్చరికలు చేసింది. ఎలాంటి ఘటన జరిగినా స్పందించేందుకు అత్యవసర సేవలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఇక రాబోయే రోజుల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సూచనలు పాటించాలని నిపుణులు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com