Hamas-Israel: ఐడీఎఫ్ దాడిలో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ హతం!

ఐడీఎఫ్ దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వార్ చనిపోయే అవకాశం ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. గత 5 నెలల్లో తొలిసారి బుధవారం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు. హమాస్ నాయకుడు మొహమ్మద్ సిన్వార్ చనిపోయి ఉంటాడని పేర్కొన్నారు. మే నెల ప్రారంభంలో దక్షిణ గాజాలోని ఒక ఆస్పత్రిపై ఐడీఎఫ్ దాడి చేసింది. ఆ దాడిలో మొహమ్మద్ సిన్వార్ చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే అతడి మరణవార్తను ఇప్పటి వరకు హమాస్ నిర్ధారించలేదు. 2024, అక్టోబర్‌లో యాహ్యా సిన్వార్ హతమయ్యాడు. అనంతరం అతని సోదరుడు మొహమ్మద్ సిన్వార్ గాజా ప్రాంతంలో హమాస్‌కు నాయకుడయ్యాడు. ప్రస్తుతం అతడి కూడా చనిపోయినట్లు నెతన్యాహు పేర్కొన్నారు. దీనిపై మరింత క్లారిటీ రావల్సి ఉంది.
జెరూసలేంలో నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ.. 10 వేల మంది ఉగ్రవాదులను నిర్మూలించినట్లు తెలిపారు హనియే, యాహ్వా సిన్వార్ లాంటి హంతకులను చంపినట్లు చెప్పారు. తాజాగా మొహమ్మద్ సిన్వార్ కూడా హతమైనట్లుగా చెప్పుకొచ్చారు. గాజా నియంత్రణ కోసం సైనిక కార్యకలాపాలను కొనసాగిస్తామని చెప్పారు. సహాయ ట్రక్కులను అనుమతించినప్పటికీ.. సామాగ్రి మాత్రం పౌరులకు చేరలేదన్నారు. 11 వారాల దిగ్బంధనం తర్వాత గాజాలోకి 100 సహాయ ట్రక్కులను ఇజ్రాయెల్ అనుమతించింది. ఇక అమెరికాతో విభేదాలు తలెత్తాయన్న ఊహాగానాలను నెతన్యాహు తోసిపుచ్చారు. ఇక బందీలను తిరిగి తీసుకురావడానికి ఇజ్రాయెల్ తాత్కాలిక కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని నెతన్యాహు చెప్పారు. లేకుంటే గాజాపై పూర్తి నియంత్రణ సాధించడానికి సైనిక చర్యతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com