Hamas: మ‌రో ఇద్ద‌రు బందీల‌ను విడుద‌ల చేసిన హ‌మాస్

Hamas: మ‌రో ఇద్ద‌రు బందీల‌ను విడుద‌ల చేసిన హ‌మాస్
మానవతా దృక్పథంతో విడిచిపెట్టామని ప్రకటన

హమాస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న మరో ఇద్దరు ఇజ్రాయెల్ పౌరులకు విముక్తి లభించింది. వృద్ధులు కావడంతో మానవతా దృక్పథంలో వారిని విడుదల చేసినట్లు హమాస్ ప్రకటించింది.

ఖ‌తార్, ఈజిప్టు మ‌ధ్య‌వ‌ర్తిత్వంతోనే మ‌హిళ‌ల‌ను విడిచిపెట్టామ‌ని హమాస్ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. వయసు రీత్యా వారిద్దరి అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని, అయినప్పటికీ శుక్రవారం నాడు వారిని తీసుకెళ్లేందుకు ఇజ్రాయెల్ నిరాకరించిందని తన ప్రకటనలో పేర్కొంది. విముక్తి కల్పించిన బందీల పేర్లు నురిట్ కూపర్ , యోచెవెద్ లిఫ్‌షిట్జ్ గా స్థానిక మీడియా వెల్లడించింది. వీరిద్దరిని గాజా సరిహద్దు సమీపంలోని నిర్ ఓజ్‌లోని కిబ్బత్జ్‌లో బందీలుగా పట్టుకున్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో భీకర దాడుల తర్వాత సదరు మహిళలతోపాటు వారి భర్తలను కూడా బందీలుగా చేసుకున్నారు. కానీ వారి భర్తలను మాత్రం విడుదల చేయకపోవడం గమనార్హం. ఈ పరిణామంపై ఇజ్రాయెల్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.


బందీల విడుదలకు కృషి చేసినట్టు రెడ్‌క్రాస్ అంతర్జాతీయ కమిటీ వెల్లడించింది. వారిద్దరినీ గాజా నుంచి బయటకు తీసుకెళ్లనున్నామని వెల్లడించింది. మధ్యవర్తిగా వ్యవహరించడంతో ఇది సాధ్యమైందని, భవిష్యత్తులో ఎవరి విడుదలకైనా ప్రయత్నించడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించింది. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో 300కు పైగా కొత్త దాడులు నిర్వ‌హించిన‌ట్లు ఇజ్రాయెల్ మిల‌ట‌రీ పేర్కొంది. ఈ దాడుల‌తో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 5 వేల‌కు పైగా చేరుకుంద‌ని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో 2 వేల మంది చిన్నారులు ఉన్న‌ట్లు పేర్కొంది.

హ‌మాస్ మిలిటెంట్ల వ‌ద్ద 222 మంది బందీలుగా ఉన్న‌ట్ల ఐడీఎఫ్ అధికార ప్ర‌తినిధి వెల్ల‌డించారు. అయితే, ఇదే తుది సంఖ్య కాద‌ని అన్నారు. క‌నిపించ‌కుండా పోయిన వారి కోసం మిలిట‌రీ ద‌ర్యాప్తు కొన‌సాగుతోంద‌ని చెప్పారు. హ‌మాస్ దాడి త‌ర్వాత 13 కుటుంబాల‌కు చెందిన 21 మంది చిన్నారులు అనాథ‌లుగా మారార‌ని ఇజ్రాయెల్ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఇప్పటి వరకు హమాస్ 4గురు బందీలను విడుదల చేయగా, ఇంకా 200 మందికి పైగా ప్రజలు హమాస్ వద్ద బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ అంటోంది.

రెండు రోజుల కిందట అమెరికాకు చెందిన జుడిత్‌ తారు రాన్‌, ఆమె కుమార్తె నటాలే షోషన్‌ రాన్‌లను హమాస్‌ విడుదల చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం హమాస్‌ అదుపులో 222 మంది బందీలుగా ఉన్నారని సమాచారం. వీరిలో అమెరికాతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారు. పలు మీడియా నివేదికల ప్రకారం.. మరో 50 మంది బందీలను హమాస్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే కాల్పుల విరమణపై అమెరికా తన మాట మార్చింది.

Tags

Next Story