Hamas: హమాస్‌ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌ సైన్యం

Hamas: హమాస్‌ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్‌ సైన్యం
భయంభయంగా గాజా ప్రజలు

గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలంటూ.... ప్రపంచ దేశాలు ఒత్తిడి పెంచుతున్న వేళ..... ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రతను... మరింత పెంచింది. హమాస్‌ అగ్రనేతల అంతమే పంతంగా ముమ్మర దాడులు చేస్తోంది. దక్షిణ గాజాలో హమాస్‌ మిలిటెంట్లు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆ దిశగా సాగుతోంది. 20 ప్రాంతాలను ఖాళీ చేయాలని గాజా పౌరులకు ఇజ్రాయెల్‌ అల్టీమేటం జారీ చేసింది. ఇజ్రాయెల్‌ దాడిలో ఇప్పటివరకూ 15 వేల 500 మందికిపైగా మరణించగా 23 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు భూతల దాడుల్లో 76 మంది ఇజ్రాయెల్‌ సైనికులు కూడా మరణించారు.

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య సంధి ముగిసిన వెంటనే గాజాపై బాంబులతో విరుచుకుపడ్డ నెతన్యాహు దళాలు ఇప్పుడు భూతల దాడులు మరింత విస్తరిస్తున్నట్లు వెల్లడించాయి. హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా దాడులను విస్తరిస్తున్నామని..తమ భూభాగంపై ఎవరు దాడి చేసినా.. వారిపై తీవ్రంగా ప్రతిదాడి చేస్తామని అదే తమ విధానామని ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించింది. గాజాలోని పలు ఆస్పత్రులతో పాటు కిండర్‌గార్డెన్‌, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలను హమాస్‌ మిలిటెంట్లు స్థావరాలుగా చేసుకున్నారని ఇలాంటి వందలాది స్థావరాలను ఇజ్రాయెల్‌ బయటపెట్టిందని గుర్తు చేసింది. గాజాలోని జబాలియా ప్రాంతంపై వరుస దాడులతో.. ఇజ్రాయెల్‌ వైమానిక దళం విరుచుకుపడింది. జబాలియా పరిసరాల్లో దాడులకు సంబంధించి అక్కడి ప్రజలకు ఇజ్రాయెల్‌ సైన్యం అల్టిమేటం జారీ చేసింది.ఏ క్షణంలోనైనా ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సి రావొచ్చని.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టింది. సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని దాదాపు 20 ప్రాంతాలను ఖాళీ చేయమని ఇజ్రాయెల్‌ సైన్యం ఆదేశాలు జారీ చేసింది. పౌరులు ఏ ప్రాంతాలకు ఏ మార్గం నుంచి వెళ్లాలో సూచిస్తున్న మ్యాప్‌లను ఇజ్రాయెల్‌ సైన్యం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.


ఇజ్రాయెల్ బలగాలు భూతల దాడులు చేస్తూముందుకు దూసుకొస్తుండడంతో దక్షిణ గాజాలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పాలస్తీనాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సుఫ్యాన్‌ తయెహ్‌ను హతమార్చిన ఇజ్రాయెల్‌ సైన్యం.. హమాస్ బెటాలియన్ కమాండర్‌ ఖువాజారిను కూడా మట్టుబెట్టింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడుల్లో పాల్గొన్న బెటాలియన్‌కు ఖోజారీ నాయకత్వం వహించాడని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్‌ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 10 వేలకుపైగా వైమానిక దాడులు చేసినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్.. వీటిని మరింత పెంచుతామని ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story