New Hamas Chief: హమాస్ కొత్త చీఫ్‌గా యాహ్యా సిన్వర్

పాలస్తీనా గ్రూప్ హమాస్ నూతన చీఫ్‌గా 61 ఏళ్ల యహ్వా సిన్వర్ నియమితులైనట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆ సంస్థ చీఫ్‌గా ఉన్న ఇస్మాయిల్ హనియే గతవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో యహ్యాను నూతన చీఫ్‌గా ప్రకటించింది. ఇజ్రాయెల్ జైళ్లలో, హమాస్ అంతర్గత భద్రతా వలయంలో ఇన్నాళ్లూ గడిపిన యహ్యా ఇప్పుడు పాలస్తీనా సమూహాన్ని నడిపించబోతున్నారు. సిన్వర్‌ను ‘డెడ్ మ్యాన్ వాకింగ్’ అని అభివర్ణిస్తారు. సిన్వర్‌ను ఎంపిక చేయడం ద్వారా హమాస్ తన ప్రతిఘటన మార్గాన్ని కొనసాగించబోతున్నట్టు బలమైన సందేశాన్ని పంపుతోందని హమాస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడి చరిత్రలోనే అతిపెద్దది. ఈ దాడికి పథక రచన చేసింది సిన్వరేనని అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్ చెబుతున్నదాని ప్రకారం హమాస్ దాడిలో 1,198 మంది మరణించారు. 251 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ దాడి తర్వాత సిన్వర్ అదృశ్యమయ్యారు. తమపై దాడికి ప్రతీకరంగా ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక, భూతల దాడుల్లో 39,653 మంది పాలస్తీనియన్లు మరణించినట్టు హమాస్ తెలిపింది. కాగా, తమ భూభాగంలో హనియేను హత్య చేయడంపై రగిలిపోతున్న ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతుండడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలోనే హమాస్ తమ నూతన చీఫ్‌ను ప్రకటించడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com