Israel-Hamas: హమాస్ చెరనుంచి.. 25 మంది బందీల విడుదల

నెలన్నరగా ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక కాల్పుల విరమణకు కుదిరిన సంధిలో భాగంగా తొలి దశలో తమ చెరలోని 240మంది బందీల్లో 25 మందిని హమాస్ విడుదల చేసింది. ఇందులో 13 మంది ఇజ్రాయెల్‌కు చెందిన వారు కాగా, మరో 12 మంది థాయ్‌లాండ్ పౌరులు ఉన్నారు. అటు.. ఇజ్రాయెల్ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనాకు చెందిన 39 మంది మహిళలు, చిన్నారులను విడుదల చేసింది.
హమాస్, ఇజ్రాయెల్‌కు మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల విడుదల ప్రారంభమైంది. తొలి దశలో హమాస్ తమ చెరలోని 25 మంది బందీలను విడుదల చేసింది. అందులో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉండగా.. 12 మంది థాయ్‌లాండ్ జాతీయులు ఉన్నారు. 13 మంది ఇజ్రాయెలీలను హమాస్.. రెడ్‌క్రాస్‌కు అప్పగించగా వారు రఫా సరిహద్దుకు తరలించారు. అక్కడ బందీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఈజిప్టుకు తీసుకెళ్లారు. మరోవైపు.. తమ దేశానికి చెందిన 12 మంది బందీలను హమాస్ విడుదల చేసిందని థాయ్‌లాండ్ ప్రకటించింది. థాయ్ ప్రధాని స్రెతా థావిసిన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. వారిని తీసుకొచ్చేందుకు రాయబార బృందాలు బయల్దేరినట్లు వెల్లడించారు.
అటు.. ఇజ్రాయెల్ కూడా ఒప్పందం ప్రకారం తమ జైళ్లలోని 39 మంది పాలస్తీనా మహిళలు, చిన్న పిల్లలను విడిచిపెట్టింది. ఈ విషయాన్ని ఒప్పందంలో మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ధ్రువీకరించింది. వీరిని జైళ్లలో ఉంచడానికి గల కారణాలను ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. తాము జైళ్లలో పెట్టిన వారిలో చాలా మంది ఇజ్రాయెల్ సైన్యంపై రాళ్ల దాడులు చేసినవారే ఉన్నారని తెలిపింది. హమాస్ బందీలను విడుదల చేయడంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. తమ ప్రభుత్వం బందీలందర్నీ విడిపించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ పౌరులు తమ సొంత ప్రపంచానికి వస్తున్నందుకు సంతోషంగా ఉందని నెతన్యాహుఅన్నారు. బందీల విడుదలపై స్పందించిన అమెరికా.. హమాస్ తొలి విడుతలో విడుదల చేసిన వారిలో అమెరికన్లు లేరని స్పష్టం చేసింది. మొత్తం 50 మందిని విడుదల చేయాలని ఒప్పందం కుదిరిందనీ.. తర్వాత విడుదలయ్యేవారిలో అమెరికన్లు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసింది.
కాగా అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు పాల్పడిన హమాస్ ఉగ్రవాదులు.. దాదాపు 240 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో హమాస్‌ను నిర్మూలించడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే బందీల విడుదల, యుద్ధవిరమణ కోసం వివిధ దేశాల ప్రయత్నంతో తాత్కాలిక కాల్పుల విరమణ సంధి కుదిరింది. దీని ప్రకారం 4 రోజులు ఇజ్రాయెల్ దాడులను ఆపితే.. 50 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది. అలాగే.. ఇజ్రాయెల్ కూడా 150 మంది పాలస్తీనా పౌరులను తమ జైళ్ల నుంచి విడుదల చేయాలి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com