Putin: ప్రిగోజిన్‌ శరీరంలో గ్రనేడ్ శకలాలు, వెల్లడించిన పుతిన్

Putin:  ప్రిగోజిన్‌ శరీరంలో గ్రనేడ్ శకలాలు, వెల్లడించిన పుతిన్
X
ఆ విమానంపై బయటి నుంచి దాడి జరగలేదని స్పష్టం చేసిన రష్యా అధ్యక్షుడు

విమాన ప్రమాదంలో చనిపోయిన రష్యా ప్రయివేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గనీ ప్రిగోజిన్ మృతదేహంలో పేలుడు పదార్థాల అవశేషాలు గుర్తించామని వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఘటనపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా స్పందించారు. పిగ్రోజిన్ విమాన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే, విమానంపై బయటి నుంచి దాడి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రిగోజిన్ తో పాటు ఆ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి శరీరాల్లో గ్రనేడ్ అవశేషాలను గుర్తించినట్లు పుతిన్ చెప్పారు.

రష్యా కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ కు చీఫ్ గా వ్యవహరించిన ప్రిగోజిన్ ఆగస్టులో మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు ప్రయాణిస్తున్న విమానం మార్గ మధ్యలో కూలిపోయిన విషయం తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించిన ప్రిగోజిన్.. ఆ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మధ్యవర్తిత్వంతో పుతిన్ తో రాజీ కుదుర్చుకున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత రెండు నెలలకు గత ఆగస్టులో వాగ్నర్ గ్రూప్ ముఖ్యులతో కలిసి ప్రిగోజిన్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రిగోజిన్ సహా విమానంలో ఉన్న వారంతా చనిపోయారు. అయితే ఇది ప్రమాదం కాదని, పుతిన్ సైన్యమే విమానాన్ని కూల్చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి.


ఈ ఆరోపణలపై పుతిన్ ఎన్నడూ స్పందించలేదు.. అయితే, తాజాగా గురువారం వాల్డై డిస్కషన్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. ప్రిగోజినీ విమాన ప్రమాదం ఘటన దర్యాప్తు గురించి ఆయన ప్రస్తావించారు. ‘ఇన్వెస్టిగేటివ్ కమిటీ చీఫ్ కొన్ని రోజుల కిందట నాకు నివేదించారు.. విమాన ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాల్లో హ్యండ్ గ్రనేడ్ల అవశేషాలు గుర్తించినట్టు తెలిపారు.. విమానంపై బయట నుంచి ఎటువంటి ప్రభావం లేదు..’ అని అన్నారు.

ప్రిగోజిన్ మరణంపై తన వార్షిక సమావేశంలో మాట్లాడారు. ప్రిగోజిన్ తన జీవితంలో ఎన్నో తీవ్రమైన తప్పులు చేశాడు కానీ సరైన ఫలితాలను రాబట్టాడని మెచ్చుకున్నారు. ముందస్తు కుట్ర సహా విమానం ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు రష్యా దర్యాప్తు అధికారులు చెప్పారు. అయితే, విమాన ప్రమాదంపై విచారణ జరుపుతున్న అధికారులపై పుతిన్ విమర్శలు గుప్పించారు. ప్రిగోజిన్ సహా ఇతరుల శరీరాలకు ఆల్కహాల్, డ్రగ్ టెస్టులు జరపకపోవడాన్ని పుతిన్ తప్పుబట్టారు.

Tags

Next Story