China: పర్యాటకులతో కళకళలాడుతున్న మంచు నగరం

China: పర్యాటకులతో కళకళలాడుతున్న మంచు నగరం
ఈశాన్య చైనాలోని మంచు నగరం హర్బిన్‌

ఈశాన్య చైనాలోని మంచు నగరం హర్బిన్‌పర్యాటకులతో కళకళలాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను అలరించడానికి అక్కడి యంత్రాంగం సాంస్కృతిక కార్యక్రమాలు, వినోదాత్మక ఈవెంట్‌లు, యువతను ఆకట్టుకోవడానికి మంచు క్రీడలను ఏర్పాటు చేసింది. దీంతో ఆ నగరం ఇప్పుడు చైనాలో ఉత్తమ పర్యటక ప్రాంతంగా కీర్తి పొందుతోంది.

ఈశాన్య చైనా హీలాంగ్‌జియాంగ్‌ ప్రావిన్స్‌లోని హర్బిన్ నగరంలో వార్షిక స్నో ఫెస్టివల్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. ధవళవర్ణం సంచరించుకున్న ఈ నగరాన్ని చైనాలోని పలు ప్రాంతాల వారు సందర్శిస్తున్నారు. ముఖ్యంగా గడ్డకట్టిన సాంగ్హూవా నదిపై ఎయిర్-కుషన్‌ బోట్‌ రైడింగ్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బోట్‌ పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోంది. సెయింట్‌ సోఫియా కేథడ్రల్ వద్ద ఏర్పాటు చేసిన కృత్రిమ జాబిల్లి, సాంగ్హూవా నదిపై కళాకారులు రూపొందించిన బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.


సందర్శకులు సెల్ఫీలు తీసుకునేందుకు వీలుగా నగరంలోని ప్రఖ్యాత ప్రాంతాలలో గాజుతో తయారు చేసిన భారీ పోస్ట్‌కార్డ్‌లును ఏర్పాటు చేశారు. స్థానిక మంచు కళాకారులు హర్బిన్‌ వీధుల్లో మంచుపై వివిధ కళాకృతులను రూపొందిస్తున్నారు. మంచును చెక్కి బొమ్మలను రూపొందించడం తన జీవితంలో మెుదటిసారి చూశానని ఓ పర్యాటకురాలు చెప్పారు. సెయింట్‌ సోఫియా కేథడ్రల్‌ను మంచుపై చెక్కడం అద్భుతంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.


హర్బిన్‌ నగరంలో చైనీస్ సంస్కృతిని సైతం ప్రదర్శిస్తున్నారు. కొందరు వివిధ రాజవంశాలకు చెందిన సాంప్రదాయ దుస్తులను ధరించి సందర్శకులకు ఆ కాలం నాటి సంస్కృతులపై అవగాహన కల్పిస్తున్నారు. హన్‌ఫు దుస్తులనుహీలాంగ్‌జియాంగ్ సంస్కృతి నుంచి ప్రేరణ పొంది రూపొందించామని హర్బిన్‌లోని ఆర్ట్ డైరెక్టర్ తెలిపారు. స్నో పార్కులో రెండు వేలకు పైగా మంచు శిల్పాలను ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని ప్రాచీన భవనాలను ప్రతిబింబిస్తున్నాయి. వీటిని చూడటానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story