USA: హవాయిలో కొనసాగుతున్న కార్చిచ్చు…

USA: హవాయిలో కొనసాగుతున్న కార్చిచ్చు…
80కి చేరిన మృతుల సంఖ్య..

హవాయిలో వ్యాపించిన భీకరమైన కార్చిచ్చు ఘటనలో 80 మంది వరకు చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ హవాయి దీవులకు స్వర్గధామంగా పిలిచే లహైనా రిసార్ట్ సిటీ ఇప్పుడు బూడిదగా మారింది. ఈ మంటల వల్ల అనేక మంది నిరాశ్రయులయ్యారు. హరికేన్ ప్రభావంతో భారీగా ఈదురు గాలులు వీయడంతో ఆ దావానలం మరింత విస్తరించింది. నిమిషాల వ్యవధిలోనే పట్టణమంతా వ్యాపించి.. పెను విషాదాన్ని మిగిల్చింది. ఇళ్లు, భవనాలు, వాహనాలు, ప్రజలు అగ్నికి ఆహుతయ్యారు. కార్చిచ్చు బీభత్సం సృష్టించడంతో లహైనా నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దాదాపు 2,200కు పైగా నిర్మాణాలు కాలిపోయాయని ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఫెమా) తెలిపింది.


ఇంకా వంద‌ల సంఖ్య‌లో జ‌నం కనపడకుండా పోయారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకా రాత్రి పూట క‌ర్ఫ్యూ కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల‌కు మాత్రం కేవ‌లం సెర్చ్, రెస్క్యూ బృందాల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. ల‌హైనాకు ఇంకా నీటి, విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌ర‌గ‌డం లేదు. మంట‌ల్లో అన్నీ కోల్పోయిన బాధితుల కోసం అన్వేష‌ణ జ‌రుగుతోంది. ప‌ట్ట‌ణంలో ఉన్న హార్బ‌ర్ వ‌ద్ద నీటిలో దాచుకున్న 17 మందిని ప్రాణాల‌తో ర‌క్షించారు.

హవాయి దీవుల్లో కార్చిచ్చు నేపథ్యంలో గవర్నర్​ గ్రీన్​తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ మాట్లాడినట్టు శ్వేతసౌధం వెల్లడించింది. అక్కడి తాజా పరిస్థితులను బైడెన్​ అడిగి తెలుసుకున్నారని వివరించింది. ఒకప్పుడు హవాయి రాజకుటుంబం గర్వించదగిన నివాసంగా ఉండి, సుమారు 13,000 మంది నివసించే ఈ పట్టణం ఈ కార్చిచ్చు వల్ల పూర్తిగా దెబ్బతింది. ఇక్కడ ఉన్న హోటళ్ళు, రెస్టారెంట్లు బూడిదగా మారాయి. ఇప్పటికీ 1,400 మందికి పైగా అత్యవసర తరలింపు షెల్టర్లలో తలదాచుకుంటున్నారు.



నిజానికి సహజసిద్ధంగా ఏర్పడే కార్చిచ్చుల వల్ల అడవుల్లో ఎండిపోయిన వృక్ష సంపద దగ్ధమై భూమి తిరిగి పోషకాలతో నిండుతుంది. కానీ మా­నవ నిర్లక్ష్యంతో ఏర్పడే కార్చిచ్చులు ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగులుస్తున్నాయి. ఇవాళ రేపు వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కార్చిచ్చులు ఎక్కువైపోతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితులతో వాతావరణం పొడిగా ఉండడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, కర్బన ఉద్గారాల విడుదల ఎక్కువైపోవడం వంటి వాటితో దావానలాలు పెరిగిపోతున్నాయి

Tags

Read MoreRead Less
Next Story