Pakistan : ఉసురు తీస్తున్న ముసురు

Pakistan : ఉసురు తీస్తున్న ముసురు
వరదలు, వర్షాల కారణంగా 50 మంది మృతి

పాకిస్తాన్ లో పడుతున్న కుంభ వృష్టి జన జీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటికి ఎనిమిది మంది చిన్నారులతో సహా కనీసం 55మంది మరణించారని అధికారులు చెబుతున్నారు.

జూన్ 25 న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుండి పాకిస్తాన్ అంతటా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. ఇక్కడ కురిసిన భారీ వర్షం గత 30 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టాయి. విద్యుద్ఘాతం మరియు భవనం కూలిపోవడం వంటి సంఘటనల వల్ల 55 మరణాలు నమోదయ్యాయి. 87 మంది గాయపడ్డారని జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 62 ఇల్లు దెబ్బ తిన్నాయి. 15 జంతువులు మృతి చెందాయి. వరదల కారణంగా హైవేలపై నీళ్లు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలలో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఇవి ఎక్కువగా తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో సంభవించాయి. ఇక వాయువ్య ఖైబర్ ప్రావిన్స్‌లో, షాంగ్లా జిల్లాలో కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తీర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను పునరావాసం కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.




గత ఏడాది కూడా భారీ వర్షాలు, వరదలు పాకిస్థాన్‌లో భారీ విధ్వంసం సృష్టించాయి. పాకిస్తాన్‌లో మూడింట ఒక వంతు నీటిలో మునిగిపోయింది. ఈ సమయంలో 1700 మంది మరణించారు. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అంతే కాదు, 10 లక్షలకు పైగా ఇళ్లు కొట్టుకుపోగా దాదాపు 90 లక్షల పశువులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలు, వరదల వలన ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఏర్పడకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.ప్రజలకు సహాయం చేయడానికి ఎమర్జెన్సీ నంబర్లు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, పెషావర్‌లకు భారీ ముప్పు పొంచి ఉందని అధికారులు ముందునుంచే హెచ్చరికలు జారీ చేశారు.

ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జనాభా కలిగిన పాకిస్థాన్, పొల్యూషన్ లో రెండు స్థానం లోనూ ప్రపంచంలో అత్యధిక ప్రకృతి వైపరీత్యాలు సంభవించే దేశాల్లో 8వ స్థానంలోనూ ఉంది.

Tags

Read MoreRead Less
Next Story