Israel Hezbollah War : హెజ్‌బొల్లాతో ఇజ్రాయెల్‌ కి తగ్గని తలనొప్పి

Israel Hezbollah War :  హెజ్‌బొల్లాతో  ఇజ్రాయెల్‌ కి తగ్గని తలనొప్పి
X
కొనసాగుతున్న పోరు

ఇజ్రాయెల్‌, లెబనాన్‌ కేంద్రంగా నడుస్తున్న హెజ్‌బొల్లా ఉగ్ర సంస్థ మధ్య పరస్పర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరువర్గాలు సైనిక పోస్టులు, నిఘా పరికరాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఐరాస భద్రతా మండలి తీర్మానానికి వ్యతిరేకంగా హెజ్‌బొల్లా తమపై దాడులు చేస్తోందని ఇజ్రాయెల్‌ పేర్కొంది. ఐతే గాజాలో పాలస్తీనియన్లపై దాడులకు నిరసనగా ఇజ్రాయెల్‌పై పోరు కొనసాగిస్తామని హెజ్‌బొల్లా తెలిపింది.

గాజాలో ఓపక్క హమాస్‌ మిలిటెంట్లతో భీకరంగా పోరాడుతున్న ఇజ్రాయెల్‌ మరోపక్క లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఉగ్రవాదులపై కూడా దాడులను కొనసాగిస్తోంది. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లాకు చెందిన సైనిక పోస్టులు, స్థావరాల లక్ష్యంగా దాడులు చేసింది. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. తమ సరిహద్దులను ఐడీఎఫ్‌ ఎప్పటిలానే రక్షిస్తుందని ఇజ్రాయెల్‌ సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. మార్వాహిన్‌, ధార్యా ప్రాంతాలలోని హెజ్‌బొల్లా స్థావరంపై దాడులు చేసినట్లు తెలిపింది. ఐరాస భద్రతా మండలి తీర్మానానికి వ్యతిరేకంగా హెజ్‌బొల్లా తమపై దాడులు చేస్తోందని వెల్లడించింది. మెుదట్లో సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాలకే పరిమితమైన ఇజ్రాయెల్‌ గత కొన్ని రోజులుగా సుదూర ప్రాంతాలను సైతం లక్ష్యంగా చేసుకుంటోంది. తాజాగా జరిపిన దాడి కూడా సుదూర ప్రాంతమే కావడం గమనార్హం.


అటు లెబనాన్‌ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. తమ సరిహద్దుకు ఆనుకొని ఉన్న ప్రాంతాలు, సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుంటోంది. శనివారం తమ దళాలు ఇజ్రాయెల్‌ సరిహద్దులోని పోస్టులపై ఏడు సార్లు దాడులు చేశాయని హెజ్‌బొల్లా ఉగ్ర సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్‌ నావికా స్థావరంలోని నిఘా పరికరాన్ని కూడా పేల్చివేసినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. గాజా పట్టీలో పాలస్తీనియన్లపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతాయని హెచ్చరించింది

Next Story