Israel: లెబనాన్‌ నుంచి హిజ్బుల్లా ముప్పు..

Israel:  లెబనాన్‌ నుంచి హిజ్బుల్లా ముప్పు..
సరిహద్దులో పౌరుల తరలింపు

ఒకవైపు హమాస్‌ మిలిటెంట్లతో పోరాడుతోన్న ఇజ్రాయెల్‌ సైన్యానికి లెబనాన్‌లోని హిజ్బుల్లా సంస్థ నుంచి కూడా ముప్పు పొంచి ఉంది. హిజ్బుల్లా బలగాలు ఇప్పటికే ఇజ్రాయెల్‌పై పలుమార్లు రాకెట్‌ దాడులకు పాల్పడ్డాయి. ఈ నేపథ్యంలో లెబనాన్‌ సరిహద్దు నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటున్న తమ దేశం పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇజ్రాయెల్‌ సిద్ధమైంది. ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్‌ సరిహద్దుకు రెండు కిలోమీటర్ల పరిధి వరకు నివాసితులను ఖాళీ చేయించేందుకు ఓ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం 28 ప్రాంతాల నుంచి ప్రజలను తరలించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

హమాస్‌ మిలిటెంట్ల నుంచే కాక లెబనాన్‌లోని హిజ్బుల్లా సంస్థ నుంచి కూడా ముప్పు పొంచి ఉన్న వేళ ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. హిజ్బుల్లా సంస్థ దాడులకు తెగబడుతుండటంతో లెబనాన్‌ సరిహద్దు నుంచి 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటున్న తమ దేశం పౌరులను సురక్షిత ప్రాంతాలకు ఇజ్రాయెల్‌ తరలిస్తోంది. హిజ్బుల్లా చేస్తున్న దాడులను కూడా ఇజ్రాయెల్ సైన్యం దీటుగా తిప్పికొడుతోంది.


ఉత్తర ఇజ్రాయెల్‌లో లెబనాన్‌ సరిహద్దు నుంచి తరలించనున్న పౌరులకు ప్రభుత్వ వసతి గృహాల్లో ఆశ్రయం కల్పిస్తామని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. రక్షణశాఖ మంత్రి యోవ్ గాలంట్ ఈ ప్లాన్‌ను ఆమోదించినట్లు వెల్లడించింది. స్థానిక అధికార యంత్రాంగం, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో తరలింపు ప్రక్రియ సాగుతుందని చెప్పింది. హమాస్‌ దాడుల అనంతరం లెబనాన్‌ నుంచి కూడా హిజ్బుల్లా ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌ భూభాగంపై దాడులు జరిగాయి. ఇటీవల జరిపిన ఓ క్షిపణి దాడిలో ఒకరు మృతి చెందారు. ఇజ్రాయెల్‌ సైతం లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది.

హమాస్‌, ఇతర పాలస్తీనా మిలిటెంట్ల చేతుల్లో 199 మంది బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్‌ సైన్యానికి చెందిన రేర్‌ అడ్మిరల్‌ డానియెల్‌ హగారీ తెలిపారు. అయితే, బందీలుగా ఉన్నవారిలో విదేశీయులూ ఉన్నారా? అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు. దాదాపు 10 రోజుల క్రితం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు పాల్పడిన హమాస్‌ మిలిటెంట్లు వందమందికిపైగా ఇజ్రాయెల్‌ వాసులను బందీలుగా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే బందీలను విడిపించుకునేందుకుగానూ గాజాను ఇజ్రాయెల్‌ దిగ్బంధం చేసింది. బందీలను తక్షణమే బేషరతుగా విడిచిపెట్టాలని ఐరాస చీఫ్‌ ఆంటోనియా గుటెరస్‌ కూడా కోరారు.

Tags

Read MoreRead Less
Next Story