Global Warming: అత్యంత వేడి ఏడాదిగా 2024..
గత కొన్నేళ్లుగా గ్లోబల్ వార్మింగ్ పెరగుతూ వస్తోంది. దీని ప్రభావం వల్ల ప్రస్తుతం అనేక దేశాలు వరదలు, కరవు లాంటి ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొంటున్నాయి. దీనికి సంబంధించి కోపర్నికస్ క్లైమెట్ చేంజ్ సర్వీస్ (C3S) కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2024 అత్యంత వేడి ఏడాదిగా నమోదైనట్లు పేర్కొంది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత.. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ (1850-1900) నాటికి ఎంత ఉందో దానికి మించి 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా పెరిగినట్లు తెలిపింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కోపర్నికస్ క్లైమెట్ చేంజ్ సర్వీస్ (C3S)ను యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్‌కాస్ట్స్(ECMWF) నేతృత్వంలో యూరోపియన్ కమిషన్ తరఫున తీసుకొచ్చారు. ఇందులో పనిచేసే శాస్త్రవేత్తలు 2024 ఏడాదికి సంబంధించి రోజూవారిగా, నెలవారిగా, అలాగే వార్షిక ఉష్ణోగ్రతల రికార్డులను పర్యవేక్షించారు. ECMWF, NASA, NOAA, ప్రపంచ వాతావరణ సంస్థ తదితర సంస్థలు 2024లో ప్రపంచ వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడంలో భాగస్వాములుగా ఉన్నాయి. శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, ఎల్‌నీనో ప్రభావం వల్ల వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో 2024లో ఉష్ణో్గ్రతలు పెరిగిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com