China Defence Minister: రక్షణ శాఖ మంత్రిని తొలగించిన చైనా
రెండునెలలుగా కనిపించకుండాపోయిన రక్షణశాఖ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫూపై వేటు వేసిన చైనా ఆ తరువాత 24 గంటలు కూడా తిరగకముందే మరో ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలికింది. చైనా రక్షణ శాఖ మంత్రి జనరల్ లీ షాంగ్ ఫూను జిన్‌పింగ్ సర్కార్ పదవి నుంచి తొలగించింది. ఆయన అదృశ్యమైన దాదాపు రెండు నెలల తర్వాత చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది.
లీ షాంగ్ ఫూ ఉద్వాసనకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొంది. అలాగే ఆర్థికశాఖ మంత్రి లియు కున్, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి వాంగ్ జిగాంగ్‌లను మంత్రివర్గం నుంచి తప్పించారు. వారిద్దరినీ కూడా ఎందుకు తప్పించారో కారణాలు వెల్లడించలేదు. లియు కున్ స్థానంలో లాన్ ఫోవాన్, జిగాంగ్ స్థానంలో యిన్ హెజున్‌లకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది.
చైనా అధ్యక్షునిగా జిన్‌పింగ్ మూడోసారి అధికారపగ్గాలు చేపట్టిన నాటినుంచి చాలా మంది పారిశ్రామికవేత్తలు, మంత్రులు అదృశ్యమవుతున్నారు. ఈ ఏడాది మేలో విదేశాంగమంత్రి కిన్ గాంగ్ మాయమయ్యారు. ఆ తర్వాత కొన్నిరోజులకు ఆయన్ను పదవి నుంచి తప్పించి....ఆ బాధ్యతలను అంతకుముందు నిర్వహించిన వాంగ్ యీకే అప్పగించారు. మార్చిలో రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్ లీ షాంగ్‌ఫూ కూడా ఆగస్టు 29 తర్వాత అదృశ్యమయ్యారు. ఆయన్నూ పదవి నుంచి తొలగించినట్లు చైనా అధికారిక మీడియా మంగళవారం వెల్లడించింది. జిన్‌పింగ్ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న లీ షాంగ్ ఫూ అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. ఆగస్టు 29న బీజింగ్‌లో జరిగిన చైనా – ఆఫ్రికా పీస్ అండ్ సెక్యూరిటీ ఫోరంలో ఆయన చివరిసారిగా కనిపించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) హార్డ్‌వేర్ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన అవినీతి కేసులపై విచారణ జరుగుతున్న తరుణంలో ఆయన కనిపించకుండా పోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com