Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్యపై వెలుగులోకి సంచలన విషయాలు

బంగ్లాదేశ్‌లో ఇటీవల మత విద్వేషం ముసుగులో జరిగిన హిందూ యువకుడి దారుణ హత్య ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ హత్యకు కారణమని చెబుతున్న 'మత దూషణ' ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని ప్రాథమిక విచారణలో తేలింది.
డిసెంబర్ 18 రాత్రి మైమెన్‌సింగ్‌లో దీపు చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ఒక ఉన్మాద మూక అత్యంత క్రూరంగా కొట్టి చంపింది. ఇస్లాం మతాన్ని కించపరిచాడంటూ తన ఫ్యాక్టరీలోని ఒక సహోద్యోగి చేసిన ఆరోపణలతో ఈ హింస మొదలైంది. ఆవేశంతో వచ్చిన మూక దీపును చంపి, మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పుపెట్టింది.
ఈ ఘటనపై బంగ్లాదేశ్ పత్రిక 'ది డైలీ స్టార్'తో మాట్లాడిన రాబ్-14 (RAB-14) కంపెనీ కమాండర్ మహ్మద్ సంసుజ్జమాన్ సంచలన విషయాలు వెల్లడించారు. దీపు చంద్రదాస్ తన సోషల్ మీడియాలో మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఎలాంటి పోస్ట్‌లు చేయలేదని స్పష్టం చేశారు. "దీపు మతాన్ని విమర్శించడం మేము స్వయంగా విన్నాము" అని చెప్పే ఒక్క వ్యక్తి కూడా అక్కడ లేరని ఆయన తెలిపారు. ఫ్యాక్టరీలో గొడవ జరుగుతున్నప్పుడు, ఫ్యాక్టరీకి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో అతడిని బలవంతంగా బయటకు నెట్టేశారని, ఆ తర్వాతే ఈ ఘోరం జరిగిందని అధికారి పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వచ్చిన సమాచారంతో మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం 10 మందిని పోలీసులు విచారిస్తున్నట్లు ఏఎస్పీ మహ్మద్ అబ్దుల్లా అల్ మామున్ తెలిపారు.
అంతర్జాతీయ సమాజం మౌనంపై ఆగ్రహం
ఈ దారుణ హత్యపై ఉత్తర అమెరికా హిందూ కూటమి (CoHNA) తీవ్రంగా స్పందించింది. "బంగ్లాదేశ్ ఆటవిక రాజ్యం వైపు వెళ్తోంది. హిందువులపై ఇంతటి హింస జరుగుతున్నా అంతర్జాతీయ మీడియా, ప్రపంచ దేశాలు మౌనంగా ఉండటం శోచనీయం" అని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

