Chinmoy Krishna Das: చిన్మయి కృష్ణదాస్ మళ్లీ అరెస్ట్, ఈసారి హత్య కేసులో

దేశద్రోహం ఆరోపణల కేసులో ఇటీవల బెయిల్ పొందిన బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్‌ను అక్కడి పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారు. గతేడాది జరిగిన న్యాయవాది హత్య కేసులో ఆయనను సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా, దేశద్రోహం కేసులో హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌పై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు స్టే విధించినట్లు తెలుస్తోంది.
గత ఏడాది నవంబర్ 7వ తేదీన కోర్టు ప్రాంగణంలో న్యాయవాది సైఫుల్ ఇస్లాం అలీఫ్‌పై కొందరు నిరసనకారులు దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో చిన్మయ్ కృష్ణదాస్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై పోలీసులు తాజాగా చర్యలు తీసుకున్నారని సమాచారం. ఈ కేసుల విషయమై సోమవారం వర్చువల్ విధానంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు, చిన్మయ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులకు అనుమతి ఇచ్చింది. మిగిలిన కేసులపై మంగళవారం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సంస్థ తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిన్మయ్ కృష్ణదాస్, గత ఏడాది నవంబరులో జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అగౌరవపరిచారనే అభియోగాలపై నవంబరు 25న పోలీసులు ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. అయితే, ఆయన తరఫున వాదించడానికి ప్రయత్నించిన న్యాయవాదులపై దాడులు, బెదిరింపులు జరగడంతో కేసు వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో 'సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే' అనే సంస్థ 11 మంది న్యాయవాదులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడంతో, దేశద్రోహం కేసులో ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com