Hindu Student: ‘‘బొట్టు’’ పెట్టుకున్నాడని హిందూ విద్యార్థిపై వివక్ష..

మతస్వేచ్ఛ, మత హక్కులు, మైనారిటీ హక్కుల గురించి మాట్లాడే యూకేలో హిందూ విద్యార్థిపై వివక్ష చూపించడం వివాదాస్పదంగా మారింది. తిలక్ చాండ్లోతో(నుదుట బొట్టు) వచ్చాడని 8 ఏళ్ల హిందూ విద్యార్థిని లండన్ స్కూల్ సిబ్బంది అనుచితంగా వ్యవహరించారు. తీవ్ర వివక్ష కారణంగా స్కూల్ మార్చాల్సి వచ్చింది. హిందువులు, భారతీయ కమ్యూనిటీ హక్కుల కోసం పనిచేస్తున్న ఇన్‌సైట్ యూకే అనే సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. పాఠశాల సిబ్బంది బాలుడిని తన మతాచారాన్ని వివరించాలని అడగడం ద్వారా అనుచితంగా వ్యహరించారని పేర్కొంది.
ఈ ఘటనలో స్కూల్ హెడ్ టీచర్ బాలుడిని బ్రేక్ టైమ్‌లో ప్రత్యేకంగా గమనిస్తూ ఉండటం వల్ల బాలుడు భయాందోళనకు గురయ్యాడనే ఆరోపనలు ఉన్నాయి. దీంతో బాలుడు ఆటలకు దూరంగా ఉండీ, సహచరుల నుంచి వేరుగా ఉండల్సా వచ్చిందని ఇన్‌సైట్ యూకే తెలిపింది. ఇదే కాకుండా బాలుడిని తన పాఠశాలలోని బాధ్యతాయుతమైన స్థానాల నుంచి తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే నిజమైతే ఇది బ్రిటన్ చట్టమైన ఈక్వాలిటీ యాక్ట్-2010 ప్రకారం, తీవ్రమైన మత వివక్ష కిందకు వస్తుంది.
ఇదిలా ఉంటే, బాలుడి తల్లిదండ్రులు, ఇతర విద్యార్థుల హిందూ తల్లిదండ్రులు ‘‘తిలకం’’ మతపరమైన ప్రాముఖ్యతను హెడ్ టీచర్, స్కూల్ గవర్నర్లకు పలుమార్లు వివరించేందుకు ప్రయత్నించారని, కానీ పాఠశాల యాజమాన్యం ఈ ప్రయత్నాలను పట్టించుకోలేదని, ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుని, సమాధానాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ పాఠశాలలో చూపిస్తున్న మత వివక్ష కారణంగా కనీసం నలుగురు హిందూ పిల్లలు పాఠశాల మారాల్సి వచ్చిందని సంస్థ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
