Hollywood Shut down : నిన్న రచయితలు, నేడు నటులు

Hollywood Shut down : నిన్న రచయితలు, నేడు నటులు
సమ్మెతో మూతపడిన హాలీవుడ్ ఇండస్ట్రీ

భారీ బడ్జెట్ చిత్రాలకు, అభ్యున్నత సాంకేతిక విలువలకు, ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నది హాలీవుడ్. అలాంటి హాలీవుడ్ ఇప్పుడు నిరసనలతో భగభగ మంటుంది. నిన్న మొన్నటి వరకు ఎక్కడ చూసినా యాక్షన్, సౌండ్ లాంటి మాటలే వినిపించేవే కానీ ఇప్పుడు సమ్మె సైలెంట్ మోగుతుంది. కరోనా సమయంలో వెలవెలబోయినట్లుగానే ఇప్పుడు కూడా స్టూడియోలో కళతపాయి.


దాదాపు 63 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హాలీవుడ్‌ ఇండస్ట్రీ సమ్మె బాట పట్టింది. హాలీవుడ్‌కు చెందిన ‘సాగ్‌’ స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌- అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ టెలివిజన్‌ అండ్‌ రేడియో ఆర్టిస్టు అసోసియేషన్‌ శుక్రవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది.

ఈ అసోసియేషన్‌లో లక్షా అరవై వేల మంది నటీనటులున్నారు. వారిలో టామ్‌ క్రూజ్‌, ఏంజెలినా జోలి వంటి అగ్రశ్రేణి తారలు కూడా ఉన్నారు. ‘సాగ్‌’ పిలుపుతో హాలీవుడ్‌లో షూటింగ్స్‌ మొత్తం నిలిచిపోనున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆర్టిస్టులు పాల్గొనవొద్దని అసోసియేషన్‌ కోరడంతో హాలీవుడ్‌ ఇండస్ట్రీ దాదాపుగా స్తంభించి నట్లే చెప్పుకోవచ్చు.వేతనాల పెంపుతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వల్ల భవిష్యత్తులో తమ మనుగడకే ముప్పు వాటిల్లనుందని వీరంతా ఆందోళన బాట పట్టారు. దీనివల్ల భారీ చిత్రాల రిలీజ్‌లు వాయిదా పడే అవకాశం ఉందని అంచనా. ఈ సమ్మెకు సంఘీభావం తెలియజేస్తూ ప్రముఖ దర్శకుడు క్రిష్టోఫర్‌ నోలన్‌ రూపొందించిన ‘ఒప్పెన్‌ హైమర్‌’ ప్రీమియర్‌ షోను ఆ చిత్ర నటీనటులు బహిష్కరించడం హాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

అసలు మే 1వ తేదీ నుంచి ‘రైటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా’ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె జరుగుతున్నది. తమ మేథస్సునంతా ధారబోసి రాసే కథలతో హాలీవుడ్‌ స్టూడియోలు కోట్లకు పడగలెత్తుతున్నాయని, తమకు మాత్రం నామమాత్రపు పారితోషికాలు అందుతున్నాయని రైటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ అమెరికా ఆరోపిస్తున్నది. స్క్రీన్‌ రైటింగ్‌కు భవిష్యత్తు ఉండాలంటే భారీ ఎత్తున పారితోషికాలను పెంచాల్సిందేనని అక్కడి రచయితలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు వీరికి యాక్టర్స్‌ అసోసియేషన్‌ తోడు కావడంతో హాలీవుడ్‌ ఇండస్ట్రీలో సినిమాలు, టీవీ సిరీస్‌లు దాదాపు నిలిచిపోనున్నాయి.

1960లో నటుడు రోనాల్డ్‌ రీగన్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా హాలీవుడ్‌లో సమ్మె జరిగింది. అప్పుడు ఇదే మాదిరిగా యాక్టర్స్‌, రైటర్స్‌ యూనియన్స్‌ సంయుక్తంగా సమ్మెలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1980లో స్క్రీన్‌ యాక్టర్స్‌ సమ్మెకు దిగారు. దాదాపు 63 ఏళ్ల తర్వాత హాలీవుడ్‌ మొత్తం సమ్మెబాట పట్టడం సంచలనంగా మారింది

Tags

Read MoreRead Less
Next Story