Hong Kong: పేలిన విమానం టైరు, 11 మందికి గాయాలు

హాంకాంగ్ ఎయిర్ పోర్ట్ లో పెను ప్రమాదం తప్పిపోయింది. సాంకేతిక లోపంతో టేకాఫ్ నిలిపివేసిన హాంకాంగ్ విమానం టైర్ పేలి 11 మంది విమాన ప్రయాణికులు గాయపడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కాథీ పసిఫిక్ సీఎక్స్ 880 విమానం లాస్ ఏంజెల్స్ కు బయలుదేరింది. అయితే విమానం టేకాఫ్ అవుతుండగానే సాంకేతిక సమస్య తలెత్తడంతో తక్షణమే స్పందించిన పైలట్ విమానాన్ని నిలిపివేశారు. ముందు జాగ్రత్తగా విమానం నుంచి త్వరగా దిగమంటూ ప్రయాణికులకు అనౌన్స్మెంట్ ఇచ్చారు.
ఈ కాథీ పసిఫిక్ విమానంలో 17 మంది సిబ్బంది, 293 మంది ప్రయాణికులున్నారు. విమానం నుంచి ప్రయాణికులు దిగుతుండగా విమానం టైరు ఒక్కసారిగా పేలింది. దీంతో 11 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో 9 మంది ప్రయాణికులను ఇప్పటికే డిశ్చార్జ్ చేశామని విమానాశ్రయ అధికారులు చెప్పారు. గాయపడిన ప్రయాణికులకు విమానయాన సంస్థ సహాయం అందించింది. విమాన ప్రయాణికులకు ఈ ప్రమాదం వల్ల అసౌకర్యం కలిగినందుకు కాథే విమాన సంస్థ క్షమాపణలు చెప్పింది. అయితే విమానంలో లోపం ఏమిటి అనేది ఇప్పటివరకు పూర్తిగా తెలియ రాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com