Dalai Lama: మరో 30-40 ఏళ్లు జీవించాలని ఆశగా ఉంది: దలైలామా

టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామావారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని..ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తన మనసులోని మరో విషయాన్ని బయటపెట్టారు. జులై 6న తన 90వ పుట్టిన రోజు వేడుక నిర్వహించుకోనున్న నేపథ్యంలో.. ఆయన అనుచరులు దలైలామా దీర్ఘాయుష్షు కోసం పలు ప్రార్థనలు నిర్వహించారు. అందులోభాగంగా టిబెట్ బౌద్ధమత గురువు మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేస్తూ మరో 30-40 ఏళ్లు జీవించాలని ఉందనే తన ఆకాంక్షను వ్యక్తంచేశారు. మరికొన్నేళ్లు ఆరోగ్యంగా జీవించగలననే దేవుని స్పష్టమైన సంకేతాలు తనకు అందుతున్నాయన్నారు. బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. గతంలోనూ దలైలామా తన ఆయుష్షు గురించి మాట్లాడుతూ..తాను 110 ఏళ్లు జీవిస్తానని ఓ కల వచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం తనకు 90 ఏళ్లు నిండటంతో 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని.. దానిని నిర్వహించే అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్‌కు మాత్రమే ఉందని ఇటీవల టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా తేల్చిచెప్పారు. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి.. తన వారసుడి ఎంపిక కొనసాగించాలా..?అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్నివర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకొనే అధికారం ఎవరికీ లేదని చైనాను ఉద్దేశించి అన్నారు.
కాగా.. టిబెట్‌పై పట్టు కోసం భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని కబ్జా చేయాలని చైనా భావిస్తోంది. ఆ స్థానం ఎంపికలో పంచయిన్ లామా పాత్ర చాలా కీలకం. టిబెట్‌లోనే ఉండిపోయిన పంచయిన్ లామా 1989లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయనపై విష ప్రయోగం చేశారంటారు. పంచయిన్ లామా వారసుడిగా ఎంపికైన బాలుడిని తన అధీనంలో ఉంచుకొన్నట్లు కొన్నేళ్ల కిందట బీజింగ్ ప్రకటించింది. ఈ ఎత్తుగడలను గ్రహించిన దలైలామా తన పునర్జన్మ టిబెట్ బయట కూడా జరగొచ్చని ప్రకటించారు. దీంతోపాటు వారసుడిని (పునర్జన్మ పొందిన బాలుడిని) ఎంపిక చేసే ప్రక్రియ కూడా తమదేనని తేల్చిచెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com