Houthi Rebels: ఎర్ర సముద్రంలో మరోసారి రెచ్చిపోయిన హౌతీలు

ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశారు. బాలెస్టిక్ క్షిపణులు, యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడ్డారు. వెంటనే అలర్ట్ అయిన యుద్ధ నౌకలోని సిబ్బంది.. వాటిని తిప్పికొట్టిందని.. ఈ దాడిలో నౌకకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని, సిబ్బంది ఎవరూ గాయపడలేదని పెంటగాన్ వెల్లడించింది.
సరిగ్గా ఏడాది క్రితం అంటే 2023 నవంబర్ లో ఎర్ర సముద్రం, ఏడెన్ గల్ఫ్ నౌకలపై హౌతీల దాడులు ప్రారంభమయ్యాయి. ఎర్ర సముద్రం మీదుగా జరిగే అంతర్జాతీయ నౌకా వాణిజ్యాన్ని టార్గెట్ చేసిన హౌతీలు.. వరుస దాడులకు పాల్పడుతున్నారు. హౌతీల దాడుల నుంచి వాణిజ్య నౌకలకు రక్షణగా అమెరికా, ఇతర దేశాలు ఎర్ర సముద్రంపై సైనిక నౌకలను మోహరించాయి. వారిపై వైమానిక దాడులను సైతం నిర్వహించాయి. అయినా హౌతీ రెబెల్స్ దాడులను ఆపటం లేదు.
సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాల మద్దతుతో నడుస్తున్న యెమన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న హౌతీలకు ఇరాన్ మద్దతునిస్తోంది. దీంతో గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని నిరసిస్తూ హౌతీలు ఎర్ర సముద్రంలో దాడులకు దిగుతున్నారు. దాదాపు 35 దేశాలకు చెందిన రవాణ నౌకలపై వారు డ్రోన్లు, క్షిపణులతో వందకుపైగా దాడులు చేసినట్లు గతంలో అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com