Russia : ఆర్థిక ఆంక్షలతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. కళ్లముందుకు మళ్లీ 1990ల నాటి కష్టాలు..!

Russia : ఉక్రెయిన్‌పై రష్యా దాడితో... యురోపియన్ యూనియన్ దేశాలు... రష్యాపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రష్యా ప్రజలు. స్విఫ్ట్ నుంచి రష్యా బ్యాంకులను తొలగించడంతో... విదేశీ సెంట్రల్ బ్యాంకుల్లో రష్యా విదేశీ మారకద్రవ్య నిల్వలు స్తంభించిపోయాయి. రూబుల్‌ను విదేశీ కరెన్సీగా మార్చుకోలేకపోతున్నారు. చెల్లింపు వ్యవస్థలన్నీ నిలిచిపోయాయి. ఏటీఎంల నుంచి డబ్బులు రావడంలేదు. బ్యాంకుల కార్డులు పనిచేయడం లేదు. బ్యాంకుల్లో డిపాజిట్ చేయడమూ కష్టంగానే మారింది.
ఆంక్షల ప్రభావం రష్యాలోని సూపర్ మార్కెట్లపైనా పడింది. ఒక్కోవ్యక్తి పరిమితంగానే నిత్యావసరాలను కొనుక్కోవాల్సి వస్తోంది. షాపింగ్ మాల్స్ పెద్ద మొత్తాల్లో సరకుల్ని అమ్మడం ఆపేశాయి. నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు 40 శాతం పెరిగాయి. యుద్ధం పేరు చెప్పి అనేక సంస్థలు ఉద్యోగులకు లే-ఆఫ్‌లు వేస్తున్నాయి. వేతనాలు, పింఛన్ల చెల్లింపుల్ని సైతం జాప్యం చేస్తున్నాయి.
విదేశీ సంస్థలు సైతం తమ ఉత్పత్తుల్ని రష్యాలో విక్రయించకూడదని నిర్ణయించాయి. రెండ్రోజుల నుంచి ఆపిల్-పే' సేవలు ఆగిపోయాయి. నైక్ తదితర ప్రముఖ బ్రాండ్లు ఆన్‌లైన్ విక్రయాలను నిలిపేశాయి. హాలీవుడ్ స్టూడియో సైతం రష్యాలో తమ చిత్రాల విడుదలను ఆపేశాయి.అటు.. మందులు వైద్య పరికరాలూ దొరకడం లేదు. 1990ల నాటి కష్టాలు మళ్లీ కళ్లముందు మెదులుతున్నాయి.
మరోవైపు పుతిన్ సన్నిహితులైన పాతికమంది కుబేరులపై ఆర్ధిక ఆంక్షలు విధించింది యూరోపియన్ యూనియన్. రూబుల్ విలువ తగ్గిపోతుండటంతో వీలైనంత త్వరగా తమ సొమ్మును విదేశీ కరెన్సీలోకి మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.1998 తర్వాత ఇంతటి ఆర్థిక సంక్షోభం తలెత్తడం ఇదే మొదటిసారి. ఆహారం కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించే పరిస్థితి రష్యా రావచ్చనే ప్రచారం జరుగుతోంది.
అటు రష్యా సైతం... ట్విటర్, ఫేస్‌బుక్, బీబీసీ యాప్ స్టోర్ సేవల్ని బ్లాక్ చేసింది. రష్యా దాడుల గురించి ఉక్రెయిన్, ఇతర ప్రాంతాల నుంచి వస్తోన్న సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్, ట్విటర్, యాప్ స్టోర్ అన్నీ అమెరికాకు చెందిన సంస్థలు. అటు బీబీసీ బ్రిటన్‌కు చెందింది. వీటి సేవలపై ఆంక్షలంటే అమెరికా, బ్రిటన్‌తో రష్యా పోరు దిగినట్లేనంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com