Israel Hamas War: రష్యా విమానాశ్రయంలో కలకలం

Israel Hamas War: రష్యా విమానాశ్రయంలో కలకలం
X
ఎయిర్‌పోర్ట్‌లోకి చొచ్చుకొచ్చి ...విమానంలో ఇజ్రాయిలీల కోసం వెతుకులాట

రష్యా విమానాశ్రయంలో జరిగిన అనూహ్య ఘటనతో ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. దగెస్థాన్‌ ఎయిర్‌పోర్ట్‌లో నిరసనకారులు నినాదాలు చేయడం ప్రయాణికులపై దాడి చేయడంపై.. ఇజ్రాయెల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే రష్యాలోని తమ పౌరులకుహెచ్చరికలు జారీ చేసింది. రష్యాలోని ముస్లిం ప్రాంతాలకు ప్రయాణించవద్దని ఇజ్రాయెల్ తమ పౌరులను హెచ్చరికలు జారీ చేసింది.

రష్యాలో విమానాశ్రయ ఘటన అనంతరం ఇజ్రాయెల్‌ అప్రమత్తమైంది. రష్యాలోని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్లవద్దని తమ పౌరులను ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. రష్యాలోని అడిజియా, చెచ్నాయ్యా, దగేస్థాన్‌, ఇంగుషెటియా, కబార్డినో కల్మికియా, చెర్కేసియా, ఉత్తర ఒస్సేటియా, అలెనియా, క్రాస్నోడార్ మినరల్నీ వోడి, స్టావ్రోపోల్ ప్రాంతాలకు వెళ్లవద్దని తమ పౌరులను ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. విదేశాల్లో ఉంటున్న ఇజ్రాయెల్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రదర్శనలు, నిరసనలకు దూరంగా ఉండాలని కూడా మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ దేశంలో ఉండే ఇజ్రాయెల్‌ పౌరులు ఆ దేశంలోని భద్రతా దళాల సూచనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది.


విమానాశ్రయంలో దాడిపై రష్యా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై ఇజ్రాయెల్‌ అసహనం వ్యక్తం చేసింది. రష్యా నేతలతో చర్చల కోసం...... హమాస్ ప్రతినిధి బృందం మాస్కోకు వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్‌ గుర్తు చేసింది. గాజాలో దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇజ్రాయెల్‌ విదేశాల్లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అరబ్‌లో గాజాకు మద్దతుగా ఆందోళనలు జరుగుతుండడంతో అరబ్ దేశాలకు ప్రయాణించవద్దని ఇప్పటికే తమ పౌరులను ఇజ్రాయెల్‌ హెచ్చరించింది.

ఇజ్రాయెల్‌ నుంచి బయలుదేరిన విమానం రష్యాలోని దగెస్థాన్‌ విమానాశ్రయంలో ఆగడంతో అక్కడి నిరసనకారులు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విమానాన్ని తమ ప్రాంతంలో ల్యాండ్‌ చేయడాన్ని వందలాదిమంది పౌరులు వ్యతిరేకించారు. విమానం దిగిన వారిపైకి దూసుకెళ్లారు. లగేజీ తీసుకుంటున్న వారిని చుట్టుముట్టారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఘర్షణలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు. రష్యా అధికారులు నిరసనకారుల చర్యలను అడ్డుకునేందుకు భద్రతా దళాలను రంగంలోకి దింపారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి విమానాలను వేరే ప్రాంతాలకు మళ్లించినట్లు రష్యా ఏవియేషన్‌ అథారిటీ రోసావియాట్సియా వెల్లడించింది. ఈ ఘటనతో నవంబరు 6 వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. నిరసనకారుల చర్యపై ఇజ్రాయెల్‌ ఆందోళన వ్యక్తం చేసింది

Tags

Next Story