Israel Hamas Conflict: దక్షిణ గాజాపై ఇజ్రాయెల్​ భీకర దాడులు

Israel Hamas Conflict: దక్షిణ గాజాపై ఇజ్రాయెల్​ భీకర దాడులు
5 వేల మందికిపైగా హమాస్‌ మిలిటెంట్లు హతం

దక్షిణ గాజాపై భీకర దాడులతో ఇజ్రాయెల్‌ సైన్యం విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు 5 వేల మందికిపైగా హమాస్‌ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా 18 లక్షల మందికిపైగా గాజా పౌరులు తమ ఇళ్లను వీడాల్సి వచ్చిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. సహాయ సామగ్రి పంపిణీ కష్ట సాధ్యమవుతోందని తెలిపింది.

ఉత్తరగాజాను అణువణువూ జల్లెడపట్టి హమాస్‌ స్థావరాలు, సొరంగాలు ధ్వంసం చేసిన ఇజ్రాయెల్‌ సైన్యం ఇప్పుడు దక్షిణగాజాపై వైమానిక, భూతల దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్‌ హెచ్చరికతో ఉత్తరగాజాను ఖాళీ చేసిన లక్షలాది మంది ప్రజలు ఈ దక్షిణగాజాలోనే తలదాచుకుంటున్నారు. అక్కడ కూడా ఇజ్రాయెల్‌ భీకర దాడులు చేస్తుండటంతో గాజా వాసులకు సురక్షితమైన ప్రదేశమంటూ లేకుండా పోయింది. గాజాలో రెండో అతిపెద్ద నగరమైన ఖాన్‌ యూనిస్‌ చుట్టూ హమాస్‌ మిలిటెంట్లు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య భీకర పోరు సాగుతోంది. ఇప్పుటికే పదుల సంఖ్యలో టార్గెట్లను ఇజ్రాయెల్‌ బాంబులతో ధ్వంసం చేసింది. దక్షిణ గాజాలో రఫా పట్టణంపై విరుచుకుపడింది. అక్కడ పదుల సంఖ్యలో భవనాలను నేలకూల్చింది. ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతంలో అనేక మంది హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. జబాలియా శరణార్థి శిబిరంలో లక్ష మందికిపైగా తలదాచుకుంటున్నారు. ఆ శిబిరాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్‌ సైన్యం అక్కడ హమాస్‌ స్థావరాలను ధ్వంసం చేస్తోంది. జబాలియాలో ఇజ్రాయెల్‌ దాడుల్లో ఒక జర్నలిస్ట్‌ కుటుంబానికి చెందిన 22 మంది మృతిచెందారు.


ఇజ్రాయెల్‌ దాడులతో 18 లక్షల 70 వేల మంది గాజా వాసులు తమ ఇళ్లను వీడాల్సి వచ్చిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. గాజా మొత్తం జనాభాలో ఇది 80 శాతానికి సమానం. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజాలో ఇప్పటివరకు 16 వేల 200 మంది మృతిచెందారని, 42 వేల మంది గాయపడ్డారని హమాస్‌ ఆధ్వర్యంలోని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మృతుల్లో 70 శాతం మహిళలు, చిన్నారులే ఉన్నారు.


మరోవైపు అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై దాడికి దిగిన హమాస్‌ మిలిటెంట్‌ సంస్థను పూర్తిగా రూపుమాపేవరకు విశ్రమించేదే లేదని ఇజ్రాయెల్‌ తేల్చిచెప్పింది. హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ బందీలుగా తీసుకెళ్లిన 240 మంది ఇజ్రాయెల్‌ పౌరుల్లో ఇంకా 138 మందిని విడుదల చేయాల్సి ఉంది. తాత్కాలిక సంధిలో భాగంగా 105 మందిని హమాస్‌ విడుదల చేసింది. అందుకు ప్రతిగా పెద్ద సంఖ్యలో పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. గాజాపై చేస్తున్న యుద్ధంలో 88 మంది తమ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది. 5 వేల మంది మిలిటెంట్లను హతమార్చినట్లు పేర్కొంది

Tags

Read MoreRead Less
Next Story