Donald Trump: ట్రంప్ కు అభిశంసనభయం - శరవేగంగా మారుతున్న పరిణామాలు?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీ కాలంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న 2026 మధ్యంతర ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ గెలవకపోతే డెమొక్రాట్లు తనను 'ఇంపీచ్' (అభిశంసన) చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. వాషింగ్టన్‌లో జరిగిన రిపబ్లికన్ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "మనం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి. లేదంటే నన్ను పదవి నుంచి తొలగించడానికి వారు ఏదో ఒక కారణం వెతుకుతారు" అని పేర్కొన్నారు.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పట్టుకునేందుకు ట్రంప్ జరిపిన సైనిక దాడి ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను తుపాను సృష్టించింది. కాంగ్రెస్ అనుమతి లేకుండా ఒక సార్వభౌమ దేశంపై దాడి చేయడం రాజ్యాంగ విరుద్ధమని డెమొక్రాట్లు మండిపడుతున్నారు. మేరీల్యాండ్ ఎంపీ ఏప్రిల్ మెక్లైన్ డెలానీ మాట్లాడుతూ.. వెనిజులాపై దాడి రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని, వెంటనే అభిశంసన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాలిఫోర్నియా సెనేటర్ స్కాట్ వీనర్ కూడా దీనిని 'అక్రమ దురాక్రమణ'గా అభివర్ణించారు.
ప్రముఖ డెమొక్రాట్ నేత మాక్సీన్ వాటర్స్ ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. వెనిజులా చమురు నిల్వలపై నియంత్రణ కోసమే ట్రంప్ ఈ దాడులకు పాల్పడుతున్నారని, ఇది ఇరాక్ యుద్ధం వంటి వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్ ఎంపీ డాన్ గోల్డ్‌మన్ స్పందిస్తూ.. ట్రంప్ చర్యలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా నియంతలకు ఇది స్ఫూర్తినిస్తుందని విమర్శించారు.
నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని మూడింట ఒక వంతు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఒకవేళ కాంగ్రెస్‌పై రిపబ్లికన్ల పట్టు సడలితే, ట్రంప్ ప్రతిపాదించే సంస్కరణలకు బ్రేక్ పడటమే కాకుండా, ఆయనపై అభిశంసన చర్యలు చేపట్టే అధికారం డెమొక్రాట్లకు దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

