Israel: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌తో పాటు హమాస్ మిలటరీ కమాండర్‌కు కూడా వారెంట్లు జారీ అయ్యాయి.న్యాయస్థానం అధికార పరిధిపై ఇజ్రాయెల్ అప్పీళ్లను ప్రీ-ట్రయల్ చాంబర్ తిరస్కరించిందని ఒక ప్రకటన తెలిపింది.
హమాస్ మిలటరీ కమాండర్ మొహహ్మద్ డేఫ్‌కు న్యాయస్థానం వారెంట్లు జారీచేసింది. గాజాలో జరిగిన వైమానిక దాడులలో ఆయన చనిపోయారని ఇజ్రాయెల్ సైన్యం జులైలోనే ప్రకటించింది. యుద్ధ నేరాలు, మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు ఈ ముగ్గురు వ్యక్తులు 'నేర బాధ్యత' వహించడానికి 'సహేతుకమైన కారణాలు' ఉన్నాయని న్యాయమూర్తులు చెప్పారు. కాగా, ఇజ్రాయెల్, హమాస్ రెండూ ఈ ఆరోపణలను తిరస్కరించాయి.
అరెస్ట్ వారెంట్‌లను అమలు చేయాలా వద్దా అనేది అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులోని 124 సభ్య దేశాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఇజ్రాయెల్, దాని మిత్రదేశమైన యునైటెడ్ స్టేట్స్ సభ్యులు కావు. బెంజమిన్ నెతన్యాహు, గాలంట్, డేఫ్‌లతో పాటు మరో ఇద్దరు హమాస్ నాయకులు ఇస్మాయిల్ హనియే, యాహ్యా సిన్వార్ (వీరు కూడా చనిపోయారు) కోసం ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ 2024 మేలో వారెంట్లు కోరారు. డెఫ్ చనిపోయారనే విషయాన్ని ఇజ్రాయెల్ నమ్ముతున్నప్పటికీ, కోర్టు మాత్రం దానిని నిర్థరించుకోలేకపోయింది.
ఏమిటీ కేసు?
2023 అక్టోబర్ 7న హమాస్ ఫైటర్లు దక్షిణ ఇజ్రాయెల్‌లో దాడి చేసి సుమారు 1,200 మందిని చంపి, 251 మందిని గాజాకు బందీలుగా పట్టుకెళ్లారు. ప్రతీకారంగా హమాస్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడిని ప్రారంభించింది. దీని ఫలితంగా గాజాలో దాదాపు 44,000 మంది మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఘటనలపైనే ఐసీసీలో కేసు నడుస్తోంది. హమాస్ నాయకులు మానవత్వానికి వ్యతిరేకంగా యుద్ధ నేరాలు, హత్యలు, బందీలుగా చేయడం, అత్యాచారం, చిత్రహింసలతో సహా పలు నేరాలు చేశారని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ ఆరోపించారు. పౌరులపై ఉద్దేశపూర్వక దాడులు, ఆకలిని యుద్ధ ఆయుధంగా ఉపయోగించడం, హత్యలు తదితర ఆరోపణలు ఇజ్రాయెల్ నాయకులపై ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com