Israel:హమాస్ ఎటాక్ ఎఫెక్ట్.. ఇజ్రాయెల్‌ సైన్యాధిపతి రాజీనామా

Israel:హమాస్ ఎటాక్ ఎఫెక్ట్.. ఇజ్రాయెల్‌ సైన్యాధిపతి రాజీనామా
X
మార్చి 6న పదవి నుంచి దిగిపోతున్నట్లు వెల్లడి

ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి గుడ్‌బై చెప్పారు. మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 2025, మార్చి 6న అత్యున్నత పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని నివారించడంలో విఫలమైనందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిపై దర్యాప్తునకు కూడా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఈ విషయంపై రక్షణ మంత్రికి, ప్రధానమంత్రికి లేఖ పంపినట్లు తెలిపారు. ఐడీఎఫ్ గణనీయమైన విజయాలు సాధించిందని.. బందీల విడుదల ప్రక్రియ కొనసాగుతోందని.. ఈ సమయంలో తన పాత్రను విడిచిపెడుతున్నట్లు చెప్పారు. తన వారసుడికి సమగ్రమైన రీతిలో ఐడీఎఫ్ కమాండ్‌ను బదిలీ చేస్తానని లేఖలో పేర్కొన్నారు.

అక్టోబర్ 7, 2023న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి కొందరిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. దీంతో ఆనాటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. హమాస్ అంతమే లక్ష్యంగా దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం హమాస్‌కు మద్దతుగా నిలిచిన లెబనాన్‌పైన కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అలాగే ఇరాన్‌పై కూడా ఐడీఎఫ్ దళాలు దాడులకు తెగబడ్డాయి.

అయితే ఇటీవల ఖతర్, అమెరికా మధ్యవర్తిత్వంతో చర్చలు జరగడంతో హమాస్-ఇజ్రాయెల్ మధ్య కాల్పులకు విరామం లభించింది. అంతేకాకుండా హమాస్.. బందీలను కూడా విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనీయుల్ని కూడా విడుదల చేసింది. మొత్తానికి కొద్దిరోజుల నుంచి ఇరు దేశాల మధ్య బాంబుల మోత తగ్గింది.

Tags

Next Story