Israel:నస్రల్లా వారసుడిని కూడా అంతమొందించిన ఇజ్రాయెల్

హెజ్‌బొల్లాకు మరో భారీ షాక్ తగిలింది. ఆ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లా హత్య తర్వాత అతని బంధువు హషీమ్ సఫీద్దీన్‌ను వారసుడిగా అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దాడుల్లో సఫీద్దీన్ మృతి చెంది ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. తాజాగా ఈ విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యం ధ్రువీకరించింది. ఈ మేరకు ఐడీఎఫ్ ఓ ప్రకటనను విడుదల చేసింది.
అయితే, సుమారు మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్‌బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతి, జిహాద్ కౌన్సిల్లో సభ్యుడు హషీమ్ సఫద్దీన్ చనిపోయాడు. అతనితో పాటు హెజ్‌బొల్లా ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి అలీహుస్సేన్ హజిమా, ఇతర హెజ్‌బొల్లా కమాండర్లు మరణించినట్లు ధ్రువీకరించామని ఐడీఎఫ్ ఆ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు, ఈ దాడి జరిగిన సమయంలో హెజ్‌బొల్లాకు చెందిన 25 మందికి పైగా మిలిటెంట్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు ఏరియల్ ఇంటెలిజెన్స్ పేర్కొనింది.
ఇక, లెబనాన్‌లోని దాహియాలో ఓ బంకర్‌లో సీనియర్ హెజ్‌బొల్లా నేతలతో హషీమ్ భేటీ నిర్వహించారనే.. పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో లెబనీస్ గూఢాచార విభాగం అధిపతి హుస్సేన్ అలీ హజిమాతో పాటు సఫీద్దీన్ చనిపోయారని ఐడీఎఫ్ ధ్రువీకరించింది. అయితే ఈవిషయంపై హెజ్‌బొల్లా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, 2017లో హషీమ్ సఫీద్దీన్ ను అమెరికా ఉగ్రవాదిగా ప్రకటించింది. నస్రల్లా మరణం తర్వాత హెజ్‌బొల్లా పగ్గాలను ఆయనకే అందించనున్నట్లు ఊహగానాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన మృతి చెందారు.
కాగా గతేడాది ఇజ్రాయెల్ బందీల విడుదలకు చర్చలు జరపడంలో సఫీద్దిన్ కీలక పాత్ర పోషించాడు. ఇక భద్రతా కారణాల రీత్యా నస్రల్లా అంత్యక్రియలకు హాజరుకాలేదు. అయితే ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాడు. కాగా ఇజ్రాయెల్ ప్రకటనపై హిజ్బుల్లా ఇంతవరకు స్పందించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com