Israel Hamas War : జబాలియా నగరాన్ని చుట్టుముట్టిన ఇజ్రాయెల్‌ దళాలు

Israel Hamas War  : జబాలియా నగరాన్ని చుట్టుముట్టిన  ఇజ్రాయెల్‌ దళాలు
X
ప్రార్థనా మందిరం కింద ఆయుధాలు, రాకెట్లు లభ్యమైనట్టు ప్రకటన

ఉత్తర గాజాలో మరిన్ని ప్రాంతాలను ఇజ్రాయెల్‌ సైన్యం తమ ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. గాజా నగరంపై పట్టు సాధించిన ఇజ్రాయెల్‌...ఇప్పుడు జబాలియా నగరాన్ని చుట్టుముట్టింది. అక్కడ ఐరాస శరణార్థి శిబిరం చుట్టుపక్కల యుద్ధం భీకరంగా సాగుతోంది. మరోవైపు ఓ ప్రార్థనా మందిరం కింద ఆయుధాలు, రాకెట్లు లభ్యమైనట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

ఉత్తరగాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం తన పోరాటాన్ని అంతకంతకూ విస్తరిస్తోంది. ఇక్కడి ప్రజలు కొన్ని వారాలుగా విద్యుత్‌, నీరు, ఆహారం కొరతతో అలమటిస్తున్నారు. గాజా నగరానికి ఉత్తరాన ఉన్న జబాలియా నగరాన్ని ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టింది. అక్కడ ఉన్న ఐరాస శరణార్థుల శిబిరం చుట్టుపక్కల యుద్ధం సాగుతోంది. కొన్ని వారాలుగా ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. జబాలియా క్యాంప్‌ చుట్టూ ఇజ్రాయెల్‌ సైనికులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. అక్కడ కాల్పుల కొనసాగుతున్నాయి.


హమాస్‌ మిలిటెంట్లు మళ్లీ గుమిగూడారని ఇజ్రాయెల్‌ ఆరోపిస్తోంది. మిలిటెంట్లు దాక్కొన్న మూడు సొరంగాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. కొన్ని రోజుల వ్యవధిలోనే పదుల సంఖ్యలో హమాస్‌ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం పేర్కొంది. రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఆస్పత్రి సమీపంలో ఇజ్రాయెల్‌ చేసిన వైమానిక దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక భవనాలు ఇజ్రాయెల్‌ దాడుల్లో ధ్వంసమయ్యాయి.

ఇజ్రాయెల్‌ హెచ్చరికల నేపథ్యంలో లక్షలాది మంది ఇప్పటికే దక్షిణ గాజాకు తరలివెళ్లిపోయారు. ఇప్పుడు ఉత్తరగాజాలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. ఐతే ఉత్తరగాజాలోని శరణార్థ శిబిరాల్లో ఇంకా లక్షా 60 వేల మంది ఉన్నారని ఐరాస ఏజెన్సీ వెల్లడించింది. గాజా వ్యాప్తంగా 17 లక్షల మంది ఇప్పటికే తమ ఇళ్లను వీడి నిరాశ్రయులయ్యారు. గాజా మొత్తం జనాభాలో ఇది మూడింట రెండొంతులు కావడం గమనార్హం. దక్షిణ గాజాలోని ఐరాస శరణార్థి శిబిరాల్లో లక్షలాది మంది తలదాచుకుంటున్నారు. అవన్నీ కిక్కిరిసిపోవడంతో వేలాదిమంది రోడ్లపైనే ఉండాల్సి వస్తోంది. ఆహారం, నీరు, ఇంధనం, మౌలిక సదుపాయాల కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఉత్తరగాజాలో అనేక ఆస్పత్రుల్లో వేలాది మంది ప్రజలు తలదాచుకోగా భూతల యుద్ధం అక్కడకు కూడా చేరడంతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. రోజు రోజుకు గాజాలో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటివరకు 12 వేల 700కిపైగా పాలస్తీనా పౌరులు మృతిచెందారని గాజా ఆరోగ్య మంత్రిశాఖ వెల్లడించింది. 4 వేల మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలిపింది.

గాజా నగరంలోని ఓ ప్రార్థనా మందిరం కింద ఆయుధాలు, రాకెట్లు లభ్యమైనట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అక్కడ ఆయుధాలను ఉత్పత్తి చేసేవారని ఆరోపించింది. అందుకు సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. గాజాలో ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాలను తమ స్థావరాలుగా హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ ఉపయోగించుకుంటోందని గత కొంత కాలంగా ఇజ్రాయెల్‌ ఆరోపిస్తూ వస్తోంది

Tags

Next Story