Trump: ఓడరేవులు, తీరప్రాంతాలకు వెళ్లే నౌకల్ని అడ్డుకుంటున్న అమెరికా -ఇరాన్ దిగ్బంధనం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరాయి. ఇరాన్‌పై అమెరికా నావికా దళం పూర్తిస్థాయి దిగ్బంధాన్ని ప్రారంభించడంతో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా నేవీ మరిన్ని బలగాలను రంగంలోకి దించింది. ఇరాన్ ఓడరేవుల వద్ద వచ్చిపోయే నౌకలను అడ్డుకుంటోంది. తమ దిగ్బంధం సమీపంలోకి ఇరాన్ నౌకలు వస్తే వాటిని తక్షణమే ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ ఓడరేవులకు వద్దకు నౌకలు రావాలంటే తమ అనుమతి తీసుకోవాల్సిందేనని హుకుం జారీ చేశారు.
ఇరాన్ ఓడరేవులకు వచ్చే, పోయే అన్ని సముద్ర మార్గాలను మూసివేస్తూ అమెరికా సైన్యం నిర్దేశించిన గడువు ప్రకారం ఈ దిగ్బంధం ప్రారంభమైంది. "మా దిగ్బంధం సమీపంలోకి ఏ ఒక్క ఇరాన్ నౌక వచ్చినా, దానిని వెంటనే తుడిచిపెట్టేస్తాం" అని ట్రంప్ హెచ్చరించారు.
అయితే, అమెరికా చర్యను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలాల్లో నౌకల కదలికలపై ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమని ఇరాన్ సాయుధ దళాలు పేర్కొన్నాయి. మరోవైపు, పాకిస్థాన్‌లో అమెరికాతో జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. అమెరికా వైఖరి వల్లే చర్చలు ముందుకు సాగలేదని ఆయన ఆరోపించారు.
ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌పై బాంబు దాడులు ప్రారంభించింది. మరూబ్ పట్టణంలో జరిగిన దాడుల్లో కనీసం నలుగురు మరణించారు. హెజ్బొల్లాతో ఘర్షణలు కొనసాగుతుండటంతో బింట్ జెబిల్ పట్టణ ప్రవేశ మార్గాలను ఇజ్రాయెల్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ ప్రాంతంలోనూ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
తమ ఓడరేవులు, హర్మూజ్ దిగ్బంధనంపై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ తీవ్రస్థాయిలో స్పందించారు. అమెరికా తమతో పోరుకు దిగితే.. తామూ పోరాడతామని స్పష్టం చేశారు. తమ సంకల్పాన్ని పరీక్షిస్తే, మరింత పెద్ద గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఇకముందు పెట్రోలు ధరలు తలచుకొని అమెరికన్లు బాధపడతారని ‘ఎక్స్’లో ఘాలిబఫ్ వ్యాఖ్యానించారు. మరోవైపు- ఇరాన్ భద్రతకు ముప్పు వాటిల్లితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతమంతటా సముద్ర భద్రత ప్రమాదంలో పడుతుందని ఐఆర్‌జీసీ హెచ్చరించింది. అమెరికా దిగ్బంధనానికి ప్రతీకారంగా గల్ఫ్‌లో రేవులను మూసివేస్తామని పేర్కొంది. పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రంలో భద్రత అనేది ఉంటే అందరికీ ఉండాలని.. లేకపోతే ఎవరికీ ఉండకూడదని వ్యాఖ్యానించింది. తమ ఓడరేవులకు ముప్పు కలిగితే గల్ఫ్‌లో ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని పేర్కొంది. ఇరాన్ అనుమతి పొందిన నౌకలకు మాత్రమే హర్మూజ్‌లోకి ప్రవేశించే వీలు కల్పిస్తామంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
