అమెరికాలో రోజురోజుకు మారిపోతున్న రాజకీయ పరిణామాలు

అమెరికాలో ఒకవైపు నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గరపడుతుండగా.. మరోవైపు రాజకీయ పరిణామాలు రోజురోజుకు మారిపోతున్నాయి. క్యాపిటల్ భవనంపై అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదార్లు దాడి చేసిన నాటి నుంచి పరిస్థితులు అనూహ్యంగా తయారయ్యాయి. ప్రతినిధుల సభలో ట్రంప్‌పై నేడు అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి డెమొక్రాట్లు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్ సభ్యులే మద్దతు తెలుపుతుండడంతో ట్రంప్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అటు.. 25వ రాజ్యాంగ సవరణ కింద ట్రంప్‌ను తొలగించే అంశాన్ని ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ పరిశీలిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. క్యాపిటల్‌పై దాడి జరిగిన నాటి నుంచి పెన్స్‌తో ట్రంప్ మాట్లాడడం లేదు. అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఆమోదం తెలపడానికి ఆ రోజున క్యాపిటల్ భవనంలోనే పెన్స్ ఆధ్వర్యంలోనే ఉభయసభల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికే ట్రంప్ తన మద్దతుదార్లను రెచ్చగొట్టారు. ఈ సందర్భంగా పెన్స్ భద్రత గురించి ట్రంప్ పట్టించుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాటి సమావేశంలో తనకు అనుకూలంగా వ్యవహరించలేదంటూ పెన్స్‌పై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు.
అధ్యక్షుడిగా ఉంటూ హింసను రెచ్చగొట్టినందున ట్రంప్‌ను వెంటనే తొలగించాలని, ఇందుకు 25వ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకోవాలని ఉపాధ్యక్షుడు పెన్స్‌పై ఒత్తిళ్లు వస్తున్నాయి. ట్రంప్ చర్యలు మరీ భరించరానివిగా తయారయితే వీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ప్రయత్నం వద్దంటూ రిపబ్లికన్‌లలో మరికొందరు పెన్స్‌కు నచ్చజెప్పుతున్నారు. ఇలా చేస్తే ట్రంప్ మరింతగా రెచ్చగొడతారని, అప్పుడు ప్రజల్లో మరింత విభజన వస్తుందని చెబుతున్నారు.
క్యాపిటల్ భవనంపై దాడిని చాలా మంది రిపబ్లికన్లు కూడా అంగీకరించడం లేదు. ట్రంప్ తిరుగుబాటును ప్రోత్సహించారని ఆరోపిస్తూ దిగువ సభలో డెమొక్రాటిక్ పార్టీ సభా నాయకుడు డేవిడ్ సిసిలీన్ అభిశంసన తీర్మానం రాశారు. ఇందుకు 185 మంది సభ్యులు మద్దతు తెలిపారు. బుధవారం తీర్మానంపై ఓటింగ్ జరగనుంది. అనంతరం సెనేట్‌కు పంపిస్తారు. ఆయనను పదవి నుంచి తొలగించాలా, వద్దా అనే అంశంపై అక్కడ నిర్ణయిస్తారు. మరోవైపు.. బైడెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లబోనని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ.. తాను హాజరవుతానని ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com