Imran Khan : శిక్ష రద్దు పిటిషన్ పై నేడే తీర్పు
తోషాఖానా అవినీతి కేసులో తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై తీర్పును ఇస్లామాబాద్ హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. ఆ కేసులో ఆయనకు మూడేళ్ల కారాగార శిక్ష పడి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమిర్ ఫారూఖ్, జస్టిస్ తారీఖ్ మహ్మద్ జహంగిరిలతో కూడిన ధర్మాసనం ఆయన పిటిషన్‌ను విచారించింది. రిజర్వ్ చేసిన తీర్పును మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రకటిస్తామని తెలిపింది.
మరోవైపు జైలులో ఉన్నా ఇమ్రాన్ ఖాన్ సకల సదుపాయాలను అనుభవిస్తున్నారు. ప్రత్యేకమైన సూట్ లా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని అటోక్ జిల్లా జైలులో ఇమ్రాన్ శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కారాగారంలో వసతులపై తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయనకు తాజాగా కొన్ని అదనపు సౌకర్యాలు కల్పించారు. నిబంధనల ప్రకారం ఇమ్రాన్‌కు మంచం, తలగడ, దుప్పటి, కుర్చీ, ఎయిర్ కూలర్ అందించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఇంకా ఓ ఫ్యాను, ఇంగ్లిష్ అనువాదంతో కూడిన ఖురాన్, పుస్తకాలు, వార్తా పత్రిక, ఖర్జూరాలు, తేనె, టిష్యూ పేపర్లు, పెర్‌ఫ్యూం అందించడంతో పాటు..ఓ ప్రత్యేక ప్రార్థనా గదిని ఏర్పాటు చేసినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక తన కథనంలో పేర్కొంది.
ఇమ్రాన్ కు వైద్య సదుపాయాలు అందించేందుకు ఐదుగురు డాక్టర్లు, ఒక్కొక్కరు ఎనిమిది గంటల పాటు పనిచేస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా ఆహారాన్ని అందిస్తున్నారు. అది కూడా వైద్యులు పరీక్షించిన తర్వాతే. ఆయన శ్రేయస్సు, భద్రత గురించి భార్య, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేసిన క్రమంలో అదనపు సౌకర్యాలు అందిస్తున్నారు.అంతకుముందు ఆయనపై విష ప్రయోగం చేసే అవకాశం ఉందని ఆయన పార్టీ నేతలు, భార్య బుష్రా బీబీ అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటాక్ జైలు నుంచి రావల్సిండి జైలుకు ఆయనను తరలించాలని బుష్రా బీబీ ప్రభుత్వాన్ని కోరారు.
శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మెడకు మరో కేసు చుట్టుకోనుంది. రహస్యపత్రాల దుర్వినియోగం కేసులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) ఆయనను మళ్లీ అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో ఏజెన్సీతోపాటు తీవ్రవాద వ్యతిరేక విభాగం (సీటీడబ్ల్యూ) గంటకు పైగా విచారించినట్లు పాకిస్తాన్ 'డాన్' పత్రికాకథనం పేర్కొంది. గతేడాది ఇమ్రాన్ ప్రధానిగా దిగిపోయేముందు నిర్వహించిన బహిరంగ ర్యాలీలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విదేశీ కుట్రకు ఆధారం ఇదిగోనంటూ కొన్ని పత్రాలు చేతితో పట్టుకొని ఊపుతూ చూపించారు. అమెరికాలోని పాక్ ఎంబసీ నుంచి ఈ ఆధారాలు తాము సేకరించినట్లుగా అప్పట్లో ఆయన ప్రకటించారు. ఇపుడు ఈ రహస్యపత్రాల వెల్లడి కేసు రూపంలో అదే ఇమ్రాన్ మెడకు చుట్టుకుంటోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com