Imran Khan: హిట్ లిస్టులో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
Imran Khan: ఈమధ్య అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు ఇమ్రాన్‌ఖాన్. పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిణామాలు, సంక్షోభానికి కారణం అగ్రదేశమేనంటూ పరోక్షంగా అమెరికాపై విరుచుకుపడుతున్నారు. తాను రష్యాలో పర్యటించి పుతిన్‌ను కలిస్తే నచ్చని అగ్రదేశానికి.. రష్యా నుంచి క్రూడాయిల్ తెచ్చుకుంటున్న భారత్‌కు మాత్రం మద్దతు పలికిందంటూ తన అక్కసు వెళ్లగక్కారు. అసలు పాకిస్తాన్.. శక్తివంతమైన దేశాలపై ఆధారపడటం వల్లే ఈ దుస్థితి వచ్చిందంటూ అమెరికాపై తన ఆవేశాన్ని, ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పాక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ కుట్ర జరుగుతోందని కూడా ఆరోపించారు.
అక్కడితో ఆగకుండా ఇస్లామాబాద్ అమెరికా రాయబార కార్యాలయంలోని సీనియర్ అధికారిని పిలిపించి పాక్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని గట్టిగా నిరసన తెలుపుతూ ఓ లేఖ కూడా ఇప్పించారు. దీంతో ఇమ్రాన్‌ఖాన్ ఇంకా అధికారంలో కొనసాగితే.. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని అమెరికా అధికారులు హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇమ్రాన్‌ఖాన్ కూడా ఓ సందర్భంలో బయటపెట్టారు.
అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఏ పాక్ ప్రధానికైనా పదవీ గండం తప్పదనేది గత అనుభవాలు స్పష్టంగా చెబుతున్నాయి. అగ్రదేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తే చాలు ఆర్మీ ఎంటర్ అవుతుంది. ప్రభుత్వాన్ని కూలదోస్తుంది. అవినీతికి పాల్పడ్డాడంటూ విచారణ చేపట్టి ఉరితీయడం జరుగుతుంది. 1977లోనూ పాక్ ప్రధాని జుల్ఫికర్ అలి భుట్టో అమెరికాపై ఇలానే ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మూడు నెలల్లోనే జనరల్ జియావుల్ హక్ నేతృత్వంలోని పాక్ సైన్యం తిరుగుబాటు చేసి అధికారం హస్తగతం చేసుకుంది. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి భుట్టోను ఉరి తీసింది. అందుకే, ప్రధాని పదవి నుంచి దిగిపోయిన వాళ్లు ఇక ఆ దేశంలో కనిపించరు. తలదాచుకోడానికి పరాయి దేశానికి పారిపోతుంటారు. లేదా హత్యకు గురవుతారు.
ప్రస్తుతం ఇమ్రాన్‌ఖాన్ కూడా ముందువెనక ఆలోచించకుండా అమెరికాపై ఫైర్ అవుతున్నారు. దాని ఫలితంగా పదవి కోల్పోబోతున్నారు. రేప్పొద్దున విచారణ పేరుతో ఆర్మీనే అరెస్ట్ చేసినా చేయొచ్చు. లేదంటే, హత్యకు ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదు. పాక్ హోంమంత్రి సైతం ఇమ్రాన్‌ఖాన్ ప్రాణం ప్రమాదంలో పడిందంటూ వ్యాఖ్యానించారు. తన జీవితం ప్రమాదంలో ఉందనే విశ్వసనీయ సమాచారం తనకు అందిందంటూ ఇమ్రాన్‌ఖానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే, ఇమ్రాన్‌ఖాన్ ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇమ్రాన్ ఆరోపణలు వాస్తవం కాదని అమెరికా తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com