Imran khan : జైలు బాగాలేదంటూ పిటిషన్

Imran khan : జైలు బాగాలేదంటూ పిటిషన్
అడియాలా’కి బదులు ‘అటోక్‌’కి తీసుకెళ్ళారంటూ ఆరోపణలు

తోషాఖానా కేసులో దోషిగా తేలి జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు జైళ్ల శాఖ మరీ బి క్లాస్ సౌకర్యాలు కల్పిస్తోందని అతని న్యాయవాది ఆరోపిస్తున్నారు. ఇదే జైలులో ఉంటే అతని భద్రత భద్రతకి కూడా ముప్పు ఉందని చెబుతున్నారు. కుటుంబ సభ్యులనే కాదు కనీసం లాయర్లను కూడా అనుమతించడం లేదని మండిపడ్డారు. ఇమ్రాన్‌ను రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉంచాలని ఇస్లామాబాద్‌ ట్రయల్‌ కోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఇమ్రాన్‌కు జైల్లో భద్రత కూడా కల్పించాలని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా అటోక్‌ జైలుకి తరలించినట్టుగా వారు ఒక నివేదిక లో వెల్లడించారు. అటోక్‌ జైలుకి తరలించడం కోసమే లాహోర్‌ పోలీసులు ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసారన్నారు.

జైల్లో ఉన్న ఇమ్రాన్‌ను కలవడానికి పార్టీ న్యాయవాదులకి అనుమతించడం లేదని పాకిస్తాన్ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(PTI) పార్టీ ఆరోపించింది. కోర్టు కు సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకోవడానికి అనుమతి కోరినా అధికారులు నిరాకరించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేసినట్టు లేదని, కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారని విరుచుకుపడింది. ఒక సంపన్న కుటుంబంలో పుట్టి ఉన్నత పదవిని పొందిన ఇమ్రాన్ ఖాన్ ను ఈ ప్రభుత్వం కనీస సదుపాయాలు లేని కరడు గట్టిన నేరస్తులు ఉన్న అత్యంత అసహ్యకరమైన జైలులో ఉంచారంటూ ఆరోపించారు. ఖాన్ రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంచాలని కోర్టు చెప్పినప్పటికి అతనిని ఇస్లామాబాద్‌కు పశ్చిమాన దాదాపు 80 కిలోమీటర్లు (50 మైళ్ళు) దూరంలో ఉన్న అటాక్‌ జిల్లా జైలుకు బదిలీ చేశారనీ, ఇక్కడ రాజకీయ ఖైదీలకు ఉండే సాధారణంగా సౌకర్యాలు కూడా లేవన్నారు.


తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ దోషిగా తేలారు. ఈ మేరకు శనివారం ఇస్లామాబాద్‌ జిల్లా, సెషన్స్‌ కోర్టు కీలక తీర్పు విడుదల చేసింది. ఈ కేసులో ఇమ్రాన్‌ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు అదనంగా రూ. లక్ష జరిమానాను వేసింది. జరిమానా కట్టని పక్షంలో మరో 6 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించింది. వీటితో పాటుగా ఐదేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఇమ్రాన్‌ఖాన్‌పై అనర్హత వేటు వేసింది. శిక్ష విధించిన కోర్టు వెంటనే అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో పోలీసులు హుటాహుటిన లాహోర్‌లో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ నివాసానికి చేరుకున్నారు. అతి తక్కువ వ్యవధిలో భారీ బందోబస్తుతో వెళ్లి ఇమ్రాన్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇమ్రాన్‌ఖాన్ మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఇస్లామాబాద్ కోర్టు తీర్పుపై తన న్యాయ బృందం తక్షణమే అప్పీల్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story