Maldives: 43 మంది భారతీయుల్ని బహిష్కరించిన మాల్దీవులు
నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మాల్దీవుల ప్రభుత్వం 43 మంది భారతీయులను వెనక్కి పంపించింది. దేశంలో అక్రమ వ్యాపారాలు, డ్రగ్స్ దందాలను కట్టడి చేయడానికి, వీసా రూల్స్ ఉల్లంఘన సహా పలు నేరాల విషయాలలో తీసుకొనే జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీలలో వివిధ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి స్వదేశానికి పంపించింది. మొత్తంగా 186 మంది విదేశీయులను వెనక్కి పంపగా.. అందులో ఎక్కువ శాతం బంగ్లాదేశీయులే ఉన్నారని హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు.
వీసా మానిప్యులేషన్, గడువు తీరినా అక్రమంగా దేశంలోనే ఉండడం, డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారి బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి వారి వారి దేశాలకు పంపించామని వివరించారు. ఇలా వెనక్కి పంపిన వారిలో బంగ్లాదేశీయులు 83 మంది, భారతీయులు 43 మంది, శ్రీలంక పౌరులు 25 మందితో పాటు ఎనిమిది మంది నేపాలీయులు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, చైనాకు చెందిన ఒక్కరు కూడా ఈ జాబితాలో లేరు. అలాగే బహిష్కరణ తేదీ ఇంకా తెలియరాలేదు. బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న విదేశీయులు అక్రమంగా దేశంలో నిర్వహిస్తున్న వ్యాపారాలను మూసేసే ప్రయత్నాలను చేపట్టామని మాల్దీవుల హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నమోదిత యజమానికి బదులుగా విదేశీయలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించింది.
మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవులు’’ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com