AFGHAN: ఆఫ్ఘనిస్తాన్ లో ఆరోగ్య సంక్షోభం!

AFGHAN: ఆఫ్ఘనిస్తాన్ లో ఆరోగ్య సంక్షోభం!
అఫ్గానిస్థాన్‌లో పెను సంక్షోభం దిశగా ఆరోగ్య రంగం... అతిపెద్ద మానవతా సంక్షోభమన్న ఐక్యరాజ్య సమితి... భయపడిపోతున్న వైద్య సిబ్బంది..




అఫ్గానిస్థాన్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య రంగం పెను సంక్షోభం దిశగా పయనిస్తోంది. తాలిబన్లు అధికారం చేపట్టిన రెండేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారాయి. పశ్చిమ అఫ్గాన్‌లోని షిండాండ్‌లో అమెరికా నిర్మించిన జిల్లా ఆసుపత్రిలో రోగుల సంఖ్య భారీగా పెరగడం వైద్యులను భయాందోళనలకు గురిచేస్తోంది. వార్డులు నిండిపోవడంతో ఇటీవల ఆ ఆస్పత్రిని మరింత పెద్దగా పునర్నిర్మించారు. అనేక వ్యాధులతో ప్రజలు తరలి వస్తుండడంతో మందుల కొరత భారీగా ఏర్పడింది. దీంతో మూడు పూటల వాడాల్సిన ఔషదాలను కేవలం ఒక్కపూటకే ఇస్తున్నారు. ఆస్పత్రిలో బెడ్స్‌ అందుబాటులో లేకపోవడంతో చాలామంది తిరిగి వెళ్లిపోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కొంటోందని ఐక్యరాజ్యసమితి అధికారులు స్పష్టం చేయడం అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కడుతోంది. రాబోయే కొద్ది నెలల్లో దీర్ఘకాలిక కరువు రోగుల సంఖ్యను రెట్టింపు చేయవచ్చని వైద్య సిబ్బంది ఆందోళన పడుతున్నారు.


అఫ్గాన్‌ ఆసుపత్రులను ఇటు ప్రపంచం... అటు తాలిబన్లు ఇద్దరూ విడిచిపెట్టినట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. తాలిబన్ల పాలనలో దేశం పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు కేటాయించలేకపోవడంతో గ్రామీణ ఆరోగ్య రంగం వేగంగా క్షీణిస్తోంది. రెండేళ్లు ముందువరకు అఫ్గాన్‌కు విదేశీ నిధులు భారీగా వచ్చేవి. కానీ తాలిబన్ల పాలన ప్రారంభంకాగానే ఆంక్షలు, కఠిన నిబంధనలతో నిధుల రాక తగ్గిపోయింది. ఎక్కడ తమపై దాడి చేస్తారో అన్న భయంతో విదేశాల నుంచి వైద్య సేవలు అందించే సిబ్బంది స్వదేశాలకు వెళ్లిపోయారు.అంతర్జాతీయ సమాజం కూడా అఫ్గాన్‌పై శీతకన్ను వేసినట్లే కనిపిస్తోంది. ఆఫ్ఘన్‌ రెస్పాన్స్‌ ప్లాన్‌కు ఐక్యరాజ్యసమితి అవసరమైన నిధులలో కేవలం 10 శాతం మాత్రమే కేటాయించింది.


ప్రపంచ ఆహార కార్యక్రమం కూడా అత్యవసర ప్రతిస్పందన కార్యక్రమాల నుంచి దాదాపు 80 లక్షల మంది ఆఫ్గాన్లను తొలగించింది. ఇక్కడ చాలామంది వైద్య నిపుణులు పాశ్చాత్య దేశాలపై నిరాశను వ్యక్తం చేస్తున్నారు.అఫ్గాన్‌లో అభివృద్ధి ప్రాజెక్టులు పడకేశాయి. మహిళలు ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, ఐక్యరాజ్య సమితిల్లో పని చేయకుండా తాలిబన్లు నిషేధించిన తరువాత కొన్ని స్వచ్ఛంద సంస్థలు దేశం నుంచి వెళ్లిపోయాయి. ఇదీ అఫ్గాన్‌ వైద్య రంగంపై పెను ప్రభావాన్ని చూపుతోంది. వేలమంది వైద్య సిబ్బందికి తాలిబన్‌ ప్రభుత్వం కొన్ని నెలలుగా వేతనం కూడా అందించలేదు. కుటుంబాలను బతికించుకునేందుకు వైద్య సిబ్బంది ఫర్నీచర్‌, కార్పెట్‌లు, మోటర్‌బైక్‌లను అమ్ముకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంటువ్యాధులు లాంటివి సంభవిస్తే మారణ హోమం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా తాలిబాన్ ప్రభుత్వం మాత్రం తమ పాలనను సమర్థించుకుంటోంది. క్లినిక్‌లు బాగానే నడుస్తున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ తెలిపారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఏం లేదని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. తమపై ఆంక్షలు తొలగించి ఆర్థిక సాయం చేయాలని మాత్రం అఫ్గాన్‌ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story