భారత్, అమెరికాల మధ్య నేడు కీలక 2+2 చర్చలు

భారత్, అమెరికాల మధ్య నేడు ఒక కీలకమైన రక్షణ రంగ ఒప్పందం కుదరనుంది. అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదిలీ సహా ఇరుదేశాల సరఫరా వ్యవస్థ, భూభౌగోళిక చిత్రాల వినియోగానికి సంబంధించిన ఒప్పందం జరగనుంది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ మధ్య చర్చల సందర్భంగా దీనిపై ఒక అంగీకారం కుదిరినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇరుదేశాల మధ్య రక్షణ సహా వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, రెండు దేశాల మధ్య సైన్యాల మధ్య సహకారం పెంపొందించుకోవడం మొదలైన అంశాలపై ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరిపారు. చైనాతో సరిహద్దు వివాదం అంశం కూడా వారిమధ్య చర్చకు వచ్చిందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇరుదేశాల మధ్య బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ -BECA ఒప్పందం కుదరడంపై రాజ్‌నాథ్, ఎస్పర్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్, యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ విస్తృత ప్రయోజనకర అంశాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో CDS జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె, అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ RKS బధౌరియా, DRDO చైర్మన్ సతీశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
భారత్, అమెరికాల మధ్య నేడు ప్రారంభం కానున్న 2+2 కీలక మంత్రిత్వ స్థాయి చర్చల్లో మార్క్ ఎస్పర్, మైక్ పాంపియోతో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్, జైశంకర్ పాల్గొంటున్నారు. ద్వైపాక్షిక సహకారంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతం విషయంలో పరస్పర సహకారం అంశంపై కూడా వారు చర్చించనున్నారు. అమెరికా మంత్రులు పాంపియో, ఎస్పర్... ప్రధాన మంత్రి నరేంద్రమోదీని, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌ను కూడా కలవనున్నారు. యూఎస్ రక్షణ మంత్రి ఎస్పర్‌కు రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ వద్ద త్రివిధ దళాలు గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికాయి.
సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ 2+2 చర్చలు జరుగుతుండటం విశేషం. భారత్‌తో సరిహద్దు ఘర్షణలు, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి ప్రయత్నాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ఎదుర్కొన్న తీరు.. తదితర అంశాలపై అమెరికా ఇప్పటికే పలుమార్లు చైనాను తీవ్రంగా తప్పుబట్టింది. రక్షణ, విదేశాంగ మంత్రుల భారత పర్యటనకు ముందు.. ప్రాంతీయ, ప్రపంచ శక్తిగా భారత్ ఎదగడాన్ని అమెరికా స్వాగతిస్తోందని అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది. 2016లో అమెరికా భారత్‌ను ప్రధాన రక్షణరంగ భాగస్వామిగా ప్రకటించి, రక్షణ రంగ సహకారంలో విశ్వసనీయ మిత్రదేశం హోదా కల్పించింది అగ్రరాజ్యం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com