India Vs China: టగ్‌ ఆఫ్‌ వార్‌.. చైనాపై భారత్‌ సైనికులదే పైచేయి

India Vs China: టగ్‌ ఆఫ్‌ వార్‌.. చైనాపై భారత్‌ సైనికులదే పైచేయి
X
సూడాన్‌లో టగ్ ఆఫ్ వార్ నిర్వహించిన అధికారులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో

భారత్‌, చైనా సైన్యం సూడాన్‌లో సరదాగా ఆడినకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆటలో భారత్‌ విజయం సాధించగా మన దేశ సైన్యం ప్రదర్శన ముందు డ్రాగన్‌ సైనికులు తేలిపోయారు. సూడాన్‌లో శాంతి పరిరక్షణ నిమిత్తం వెళ్లిన భారత్‌, చైనా సైనికులు స్నేహపూర్వకంగా టగ్‌ ఆఫ్‌ వార్‌ను ఆడారు. అటు ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మేజర్‌ రాధిక సేన్‌కు యూఎన్‌ మిలిటరీ జెండర్ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డును ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటర్రస్‌ ప్రదానం చేశారు.

భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది. పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది. బృందస్ఫూర్తిని, పోటీతత్వాన్ని ప్రదర్శించింది. సూడాన్‌లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన "టగ్‌ ఆఫ్‌ వార్‌"లో భారత జవాన్లు విజయం సాధించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమేనని భారత సైనిక వర్గాలు సైతం ధ్రువీకరించాయి. ఐక్యరాజ్య సమితి పీస్‌కీపింగ్‌ మిషన్‌లో భాగంగా భారత్‌కు చెందిన కొంత మంది సైనికులు సూడాన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న చైనా సైనికులతో స్నేహపూర్వకంగా "టగ్‌ ఆఫ్‌ వార్‌" ఆటను నిర్వహించగా మనవాళ్లు విజయం సాధించి తమ పోరాట పటిమను చాటారు.

2005 మార్చిలో ఐరాస భద్రతా మండలి "యునైటెడ్‌ నేషన్స్‌ మిషన్‌ ఇన్‌ సూడాన్‌"ను నెలకొల్పింది. సూడాన్‌ ప్రభుత్వం, సూడాన్‌ పీపుల్స్‌ లిబరేషన్ మూవ్‌మెంట్‌ మధ్య కుదిరిన సమగ్ర శాంతి ఒప్పందంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా అక్కడ మోహరించిన దళాలు మానవతా సహాయ కార్యక్రమాలు, మానవ హక్కుల పరిరక్షణ, ఆఫ్రికన్‌ యూనియన్‌ కార్యకలాపాలకు మద్దతుతో పాటు సామాన్యుల భద్రత కోసం పనిచేయాల్సి ఉంటుంది.

మరోవైపు ఐరాస అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్‌కు చెందిన మేజర్‌ రాధిక సేన్‌కు యూఎన్‌ మిలిటరీ జెండర్ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డును ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ప్రదానం చేశారు. డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో బాలికలు, మహిళల హక్కుల కోసం పాటుపడటంతో పాటు వారిని లైంగిక వైధింపుల నుంచి విముక్తి కల్పించారని గుటెర్రస్‌ కొనియాడారు. యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ స్టెబిలైజేషన్‌ మిషన్‌లో భాగంగా ఆమె 2023లో డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో కమాండర్‌గా 2023 మార్చి నుంచి ఏప్రిల్‌ 2024 వరకు విధులు నిర్వర్తించారు. ఈ అవార్డు తనకు ఎంతో ప్రత్యేకమని రాధిక సేన్‌ అన్నారు. కఠిన పరిస్థితుల్లో శాంతి కోసం పాటుపడుతున్న వారందరికీ ఈ అవార్డు తగిన గుర్తింపు ఇస్తుందని వ్యాఖ్యానించారు.

Tags

Next Story