ఎర్ర సముద్రంలో నౌక హైజాక్‌ వీడియో రిలీజ్

ఎర్ర సముద్రంలో నౌక హైజాక్‌ వీడియో రిలీజ్
వీడియో విడుదల చేసిన హౌతీ రెబెల్స్‌

ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్నను హైజాక్‌ చేసిన వీడియోను హౌతీరెబల్స్‌ బహిర్గతం చేశారు. ఎర్రసముద్రంపై వెళుతున్న ఆ కార్గో షిప్‌ను ఓ హెలిక్యాప్టర్‌తో వెంబడించి రెబల్స్‌ అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు.. హాలీవుడ్‌ సినిమాలో యాక్షన్‌ సీన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి.

తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న గెలాక్సీ లీడర్‌ అనే కార్గోషిప్‌ను యాక్షన్‌ సినిమాలోని సన్నివేశాల తరహాలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హౌతీ విడుదల చేసింది. హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే రెబల్స్‌ హెచ్చరించారు. అన్నట్లుగానే ఈ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హౌతీ రెబల్స్‌ విడుదల చేసిన వీడియోలోని దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. తిరుగుబాటుదారులు హెలికాప్టర్‌లో ఎర్రసముద్రంపై ఉన్న నౌక దగ్గరకు చేరుకున్నారు. షిప్‌పై ఎవరూ లేని సమయంలో హెలికాప్టర్‌ ఓడ డెక్‌పై ల్యాండ్ అయింది. అందులోంచి దిగిన రెబల్స్‌.. నినాదాలు చేస్తూ, కాల్పులు జరుపుతూ పరిగెత్తారు. ఓడలోని వీల్‌హౌస్, కంట్రోల్ సెంటర్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హైజాక్‌ తర్వాత గెలాక్సీ లీడర్‌ నౌకను యెమెన్‌లోని సలీఫ్ పోర్టుకు మళ్లించారు. ఓడపై దాడి కేవలం ఆరంభం మాత్రమే అనీ.. గాజాపై యుద్ధాన్ని ఆపేంత వరకు ఇజ్రాయెల్‌పై సముద్ర దాడులు చేస్తూనే ఉంటామని హౌతీ అధికార ప్రతినిధి మహ్మద్ అబ్దుల్-సలాం తెలిపారు.


ఈ నౌక తుర్కియే నుంచి భారత్‌కు వస్తున్న సమయంలో హైజాక్‌ జరిగింది. నౌకలోని 25 మంది సిబ్బందిని బందీలుగా హౌతీ రెబల్స్‌ తీసుకున్నారు. హైజాక్‌ ఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. నౌకలో తమ పౌరులెవ్వరూ లేరనీ అది తమది కాదని స్పష్టం చేసింది. నౌక బ్రిటీష్ జమాన్యంలోనిదని తెలిసింది. ప్రస్తుతం ఆ ఓడను జపాన్‌కు చెందిన సంస్థ నిర్వహిస్తోందని సమాచారం. కాగా.. ఇరాన్‌కు మిత్రపక్షంగా ఉన్న హౌతీలు ఇప్పటికే ఇజ్రాయెల్‌పై సుదూర క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని క్షిపణులను అమెరికా యుద్ధ నౌకలు 2సార్లు అడ్డుకున్నాయి. హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులు ఆపనంత వరకు తాము కూడా నౌకలపై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని హౌతీలు స్పష్టం చేశారు.

Tags

Next Story