UK-India: లండన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..

రెండు రోజుల యూకే పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ లండన్‌కు చేరుకున్నారు. లండన్‌లోని విమానాశ్రయంలో యూకే విదేశాంగ మంత్రి, భారత హైకమిషన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌తో ప్రధాని మోదీ చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక, ఆవిష్కరణ, భద్రత, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, విద్య, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం తదితర అంశాలపై చర్చించనున్నారు. అదేవిధంగా భారత్-యూకేల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయనున్నారు.
ఈ మేరకు బ్రిటన్ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. భారత్-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించాయి. 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందంలో పొందుపర్చారు. భారత్-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాలను ఇందులో ప్రతిపాదించారు. నరేంద్ర మోదీకి బ్రిటన్ పర్యటన నాలుగోది.
కాగా, యూకే పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన చాలా దోహదపడుతుందన్నారు. మన ప్రజలకు శ్రేయస్సు, వృద్ధి ఉద్యోగ సృష్టిని పెంచడంపై దృష్టి ఉంటుందని చెప్పారు. ప్రపంచ పురోగతికి బలమైన భారతదేశం-యూకే స్నేహం చాలా అవసరమని తెలిపారు. ఇక్కడి భారతీయ సమాజం నుంచి లభించిన హృదయపూర్వక స్వాగతం తనను కదిలించిందని వెల్లడించారు. భారతదేశ పురోగతి పట్ల వారి అభిమానం మక్కువ నిజంగా నా హృదయాన్ని తాకిందని ప్రధాని ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com