ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై మోడీ కీలక ప్రకటన

ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై ప్రధాని మోడీ.. అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు భారత్- అమెరికా మద్దతు ఇస్తాయని ఇరు దేశాధినేతలు స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ... ప్రపంచ సమస్యలపై బైడెన్‌తో కీలక చర్చలు జరిపారు. ప్రపంచ సంక్షోభానికి కారణమవుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై మోడీ తన వైఖరిని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను సమర్థించిన ఇరువురు నేతలు... ఉత్తర కొరియా వరుస బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగాలను ఖండించారు. ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలు, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని అన్ని దేశాలు గౌరవించాలని..మోడీ, బైడెన్ సంయుక్త ప్రకటనలో కోరారు. ఉక్రెయిన్ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఇరు దేశాధినేతలు.. యుద్ధాన్ని భయంకరమైనదిగా, విషాదకరమైనదిగా అభివర్ణించారు. ఆహారం, ఇంధనం, సరఫరా గొలుసు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం... పెను ప్రభావాన్ని చూపుతుందని మోడీ, బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ తీవ్రతను తగ్గించేందుకు అన్ని దేశాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ప్రజలకు మానవతా సాయం అందిస్తామని ఇరు దేశాధినేతలు ప్రతిజ్ఞ చేశారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ UN భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిండాన్ని బైడెన్, మోడీ ఖండించారు. అంతర్జాతీయ, శాంతి, భద్రతకు ఇదీ తీవ్ర ముప్పు కలిగిస్తుందన్నారు. ఉక్రెయిన్, ఉత్తర కొరియా, మయన్మార్‌లో క్షీణిస్తున్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మయన్మార్‌ను ప్రజాస్వామ్య వ్యవస్థ వైపు నడవాల్సిన అవసరాన్ని బైడెన్, మోడీ గుర్తు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com