భారత్, అమెరికాల మధ్య బెకా ఒప్పందం

భారత్, అమెరికా రక్షణ సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బేసిక్ ఎక్స్‌చేంజ్ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్-BECA ఒప్పందంపై ఇరు దేశాల నేతలు సంతకాలు చేశారు. రక్షణ మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మార్క్ ఎస్పర్, విదేశాంగ మంత్రులు జైశంకర్, మైక్ పాంపియో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమై బెకా ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. గత రెండు దశాబ్దాలుగా భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని.. ఈ సందర్భంగా జైశంకర్ అన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడం చాలా ముఖ్యమని.. దీనికి భారత్, అమెరికా మధ్య సంబంధాలు దోహదపడతాయన్నారు జైశంకర్. అమెరికా మంత్రులు పాంపియో, ఎస్పర్... ప్రధాన మంత్రి నరేంద్రమోదీని, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌ను కూడా కలవనున్నారు.
బెకా ఒప్పందాన్ని పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. సమాచార మార్పిడికి ఇది సరికొత్త మార్గాలను తెరిచిందని వ్యాఖ్యానించారు. ఇతర సమస్యలపైనా అమెరికా చర్చిచేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు రాజ్‌నాథ్ సింగ్. రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి అభివృద్ధి చెందే అవకాశం ఈ ఒప్పందం ద్వారా లభించిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. ప్రపంచంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, ప్రపంచ రక్షణ అంశాలపైనా చైనా ప్రభావం తదితర అంశాలపై ఇంకా చర్చించాల్సింది ఉందన్నారు. గతంలో పోల్చుకుంటే ఏడాది కాలంలో రక్షణ, భద్రత రంగాల్లో ఇరు దేశాలూ మరింత బలపడ్డాయన్నారు అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్. ఇండో పసిఫిక్ రీజియన్‌లోని భద్రతా పరమైన సమస్యల పరిష్కారానికి ఈ ఒప్పందం మరింత దోహదపడుతుందన్నారు.
అత్యాధునిక సైనిక సాంకేతికత, వసతి కేంద్రాలతోపాటు అంతరిక్ష సంబంధిత ఛాయాచిత్రాలను పరస్పరం వినియోగించుకునేందుకు బెకా ఒప్పందం వీలుకల్పిస్తుంది. తాజా ఒప్పందం ప్రకారం రక్షణ, భద్రత రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఇరు దేశాలు దృష్టిసారించాయి. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా... అమెరికా ఉపగ్రహాలు, సెన్సర్లు సేకరించే సమాచారాన్ని, భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో అమెరికా పంచుకుంటుంది. దీనికి సంబంధించిన తొలి చర్చలు 2018 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జరగగా.. రెండోసారి గత ఏడాది డిసెంబర్‌లో వాషింగ్టన్‌లో జరిగాయి.
సరిహద్దుల్లో చైనా సైన్యం హద్దులు దాటుతున్న పరిస్థితుల్లో.. రెండు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు సమావేశమవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా.. ప్రాంతీయ, అంతర్జాతీయ శక్తిగా ఎదిగడాన్ని తాము స్వాగతిస్తున్నట్టు అమెరికా స్పష్టం చేసింది. భారత్‌తోపాటు అమెరికాకు కూడా చైనా ఇబ్బందిగా మారిన పరిస్థితుల్లో.. రెండు దేశాలు రక్షణ, భద్రతా రంగాల్లో సహాకారాన్ని పెంచుకునే దిశగా పలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com