KP Fabian: భారత్ లొంగదని ట్రంప్‌కు అర్థమైంది: కేపీ ఫాబియన్

భారతదేశం పరస్పర సంబంధాలు ,వాణిజ్యానికి విశాల దృక్పథాన్ని కలిగి ఉంది, కానీ ఏకపక్ష నిర్ణయాలు మరియు ఒత్తిడి వ్యూహాలకు తలొగ్గదు’ అని అన్నారు భారత మాజీ దౌత్యవేత్త ఫాబియన్. భారత్‌తో అమెరికా సంబంధాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మెత్తబడినట్లు కనిపిస్తున్నా, దాని వెనుక బలమైన కారణం ఉందని మాజీ దౌత్యాధికారి కేపీ ఫాబియన్ విశ్లేషించారు. భారత్‌పై విధించిన వాణిజ్య సుంకాల పేరిట బెదిరింపులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ట్రంప్ గ్రహించడం మొదలుపెట్టారని, అందుకే ఆయన స్వరంలో మార్పు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై 25 శాతం అదనపు సుంకం విధిస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ బెదిరింపులకు భారత్ లొంగిపోతుందని ఆయన వేసిన అంచనాలు తారుమారయ్యాయని ఫాబియన్ పేర్కొన్నారు. "అమెరికా విధించిన సుంకాలకు సరైన ఆధారాలు లేవు. తన హెచ్చరికలతో భారత్ వెనక్కి తగ్గుతుందని ట్రంప్ భావించారు. కానీ, తన అంచనా తప్పని ఆయన ఇప్పుడు గ్రహించడం ప్రారంభించారు" అని ఫాబియన్ వివరించారు.
భారత్ ఒక నాగరికత కలిగిన దేశమని, ఏ ఇతర దేశం చెప్పినట్లు నడుచుకునే రకం కాదని ఆయన స్పష్టం చేశారు. "భారత్ అందరితో స్నేహాన్ని, వ్యాపారాన్ని కోరుకుంటుంది. కానీ, ఎవరి ఆదేశాలనూ అంగీకరించదు. ఈ విషయాన్ని ట్రంప్ గ్రహించాలి" అని ఆయన అన్నారు.
కొన్ని రోజుల క్రితం వైట్‌హౌస్‌లో మాట్లాడిన ట్రంప్, భారత్-అమెరికా బంధాన్ని "చాలా ప్రత్యేకమైన సంబంధం"గా అభివర్ణించారు. ప్రధాని మోదీతో తన స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే, ప్రస్తుతం ఆయన (మోదీ) చేస్తున్న కొన్ని పనులు తనకు నచ్చడం లేదని కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సానుకూలంగా స్పందించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై ట్రంప్ సానుకూల దృక్పథాన్ని తాను పూర్తిగా అభినందిస్తున్నానని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. భారత్, అమెరికాల మధ్య సమగ్రమైన, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, భవిష్యత్తులోనూ ఇది మరింత ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com